ప్రీతి ఆత్మహత్య కేసు వ్యవహారం పక్కదారి పడుతోందా..? ఈ ఎపిసోడ్ లోకి లవ్ జిహాద్ అనే అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకురాగానే.. అటు పోలీసులు సైఫ్ ను నిందితుడని ప్రకటించడం అసలు వాస్తవాలను మరుగుపరచడమేనా..? నిజంగా.. ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి సైఫ్ మాత్రమే కారణమా..? కేవలం బ్రెయిన్ లేదని అన్నంత మాత్రానే ప్రీతి సూసైడ్ అటెంప్ట్ చేసిందా..? సైఫ్ ను అకారణంగానే ఈ కేసులో ఇరికిస్తున్నారా.? అంటే అవుననే అంటున్నారు కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థులు.
ప్రీతి ఆత్మహత్య కేసు వ్యవహారంలో సైఫ్ ను నిందితుడని చెప్పేందుకు బలమైన సాక్ష్యాలు లభించడం లేదు. కేవలం వాట్సాప్ చాట్ చూపించి సైఫ్ అనే విద్యార్ధిని నిందితుడని తేల్చేశారు పోలీసులు. సీనియర్ – జూనియర్ అన్నాక ఇద్దరి మధ్య కాస్త ఆధిపత్య పోరు ఉంటుంది. అంత మాత్రానా ఇద్దరి మధ్య నడిచిన వాట్సాప్ చాటింగ్ ఆధారంగా సైఫ్ ను నిందితుడని తేల్చేయడం అసలు వాస్తవాలను మరుగన పరచడమే. ప్రీతికి బ్రెయిన్ లేదని అనడంతో ప్రీతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. బ్రెయిన్ లేదని అన్నంత మాత్రానా ప్రీతి సూసైడ్ చేసుకునే అవకాశం ఉందా..? అంటే ఛాన్స్ లేదని అంటున్నారు ఆమె తల్లిదండ్రులు. హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఇకపోతే పోలిసుల విచారణ కూడా ప్రారంభం కాకముందే బండి సంజయ్ లవ్ జిహాద్ అనే కొత్త కోణాన్ని తెరపైకి తీసుకురావడం.. ఆ తరువాత పోలీసులు సైఫ్ నిందితుడని ప్రకటించడం పలు అనుమానాలను లేవనేత్తుతోంది. సున్నితమైన ఈ కేసులో రాజకీయం చొరబడటంతోనే కేసు విచారణ తప్పుదోవ పట్టిందనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రీతి – సైఫ్ మధ్య లవ్ అనే కోణమే లేదు. లైంగిక వేధింపులూ లేవు. మతతత్వపార్టీలకు ,కార్యకర్తలకు అది లవ్ జిహాద్ గా కనిపిస్తోంది. ప్రీతి ఆత్మహత్య చేసుకునే ముందు రోజు కూడా ఇద్దరి మధ్య ఎలాంటి వాట్సాప్ సంబాషణలు లేవంటున్నారు. వారం, పది రోజుల కిందటి వాట్సాప్ చాట్ ను చూపించి సైఫ్ నిందితుడని ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది. కేవలం ఓ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అతని ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు మెడికల్ కాలేజ్ విద్యార్థులు. సైఫ్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అందరితోనూ కలుపుగోలుగానే ఉంటాడని కాకతీయ మెడికల్ విద్యార్థులే చెబుతున్నారు. అతనికి రాజకీయ, ఆర్థిక అండదండలు లేనందునే సైఫ్ ను ఈజీగా ఈ కేసులో ఇరికించి కేసు మొత్తాన్ని డైవర్ట్ చేసి.. ఓ మధ్యతరగతి కుటుంబ విద్యార్ధి భవిష్యత్ ను ప్రశ్నార్ధకం చేస్తున్నారని అంటున్నారు.
ప్రీతి డేరింగ్ అండ్ డ్యాషింగ్…సైఫ్ ఎదో అన్నాడని ఆత్మహత్య చేసుకునే రకం కాదని.. లోలోపల ఎదో జరిగిందని.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే తప్ప అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. నిజంగా… సైఫ్ ది రాక్షస మనస్తత్వం అయితే..ప్రీతి చనిపోయాక కూడా సహా విద్యార్థులు సైఫ్ కు మద్దతుగా ర్యాలీ నిర్వహించేవారా..? నిష్పాక్షపాతంగా ఈకేసు విచారణ జరిగితే తప్ప అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. కానీ ఆ ప్రయత్నం ప్రభుత్వం నుంచి జరగడం లేదు. ఎప్పుడైతే ఈకేసుపై బండి సంజయ్ స్పందిస్తూ లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడో అప్పుడే ఈ కేసులో పరిణామాలు వేగంగా మారిపోయాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.