వచ్చే ఎన్నికల కోసం టీఆరెస్ గెలుపునకు సహకరించాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు హైదరాబాద్ వేదికగా ఐ – ప్యాక్ ఆఫీసు కూడా ఓపెన్ చేసి పని ప్రారంభించింది. సోషల్ మీడియా , ఎమ్మెల్యేల బలాబలాలు వంటి విషయాలపై కేసీఆర్ కు రిపోర్ట్ సమర్పించారు. అయితే, ఇటీవలి సర్వేలో టీఆరెస్ నానాటికీ బలహీనపడుతుందని ప్రగతి భవన్ లో కేసీఆర్ కు నివేదిక ఇచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే సర్వే సారాంశం బయటకు పొక్కడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
సర్వేలు పక్కనపెట్టి కేవలం సోషల్ మీడియాలో ట్రోలింగ్, హైప్ క్రియేట్ చేసే వాటిపై మాత్రమే ఫోకస్ చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీకే – కేసీఆర్ ల బంధం ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. పైగా, వచ్చే నెల 2వ తేదీ నుంచి బీహార్ లో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని పీకే ఇదివరకే ప్రకటించి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీఆరెస్ కు రాజకీయంగా వ్యూహ , ప్రతివ్యూహాలను నివేదించడం కష్టతరమని పీకే ఓ అంచనాకు వచ్చినట్లుగా సమాచారం. సర్వేలో తేలిన ఫలితాన్ని నివేదిస్తే ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల పీకే కూడా గుర్రుగా ఉన్నారని.. వాస్తవ పరిస్థితులను జీర్ణించుకోలేని స్థితిలోనున్న కేసీఆర్ తో కలిసి పని చేయడం కష్టమని పీకే భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. జాతీయ రాజకీయాల ఆగమనం అంటోన్న కేసీఆర్ కాస్త కూడా సంయమనం పాటించకుండా,ప్రతిసారి భజన కీర్తనలను వినాలనుకుంటే ఎలా అని ఐ – ప్యాక్ టీమ్ తో పీకే అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
వీరి బంధం మున్నాళ్ళ ముచ్చటగా మిగులనుందనే వార్తల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు నియామకం చేసుకున్న ఉద్యోగులను ఏపీకి బదాలయించారు. దీంతో టీఆరెస్ కు ఐ – ప్యాక్ తన కాంట్రాక్ట్ ను మధ్యలోనే తెంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఎం జరుగుతుందో..!