తెలంగాణలో ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఇటీవల అంత సర్దుకుంటుందని అని భావిస్తోన్న సమయంలోనే తాజాగా మరోసారి వివాదం రాజుకుంటున్నట్లు కనిపిస్తోంది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట గవర్నర్ లు పాలనపరమైన అంశాల్లో మితిమీరి జోక్యం చేసుకుంటున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలోనూ కనిపిస్తోందంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన నాలుగైదు బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. కాని గవర్నర్ తమిళిసై మాత్రం అటు ఆమోదించకుండా , ఇటు తిరస్కరించకుండా తన వద్దే పెండింగ్ లో ఉంచారు. కొన్ని బిల్లులపై తనకు సందేహాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాలని ఆమె మంత్రులను కోరారు. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన బిల్లుపై చర్చించాలంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాజ్ భవన్ కు ఆహ్వానిస్తూ లేఖ పంపారు. కాని మంత్రి మాత్రం తనకు ఎలాంటి లేఖ అందలేదని, అలాంటప్పుడు తనెందుకు రాజ్ భవన్ వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ కార్యాలయ వర్గాలు మాత్రం తాము విద్యాశాఖ మంత్రికి లేఖ రాశామని చెబుతున్నాయి.
రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలకు గవర్నరే ఛాన్సలర్ గా ఉంటారు. అది గౌరవ మర్యాద కోసమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాలన అంత ప్రభుత్వం చేతులోనే ఉంటుంది. కాని గవర్నర్ తమిళిసై మాత్రం యూనివర్సిటీల కోసం అసెంబ్లీ ఆమోదించిన బిల్లు విషయంలో కాస్త అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఈ విషయంలోనే సర్కార్ వర్సెస్ రాజ్ భవన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.