కర్ణాటక ఎన్నికలకు మరెంతో సమయం లేదు. మే నెలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ప్రజల మనస్సు గెలుచుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలను ఖరారు చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంపై అప్పుడే దృష్టిసారించాయి. మండుటెండలను సైతం ఖాతరు చేయకుండా ప్రచారం చేసేందుకు రెడీ అయిపోయాయి.
మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ మాత్రం ఈసారి అధికారం తమదేనని ధీమాగా ఉండగా జేడీఎస్ పూర్తిమెజార్టీతో పవర్ లోకి రావాలని టార్గెట్ పెట్టుకొని ప్రచారం చేపడుతోంది.ఈ ఎన్నికలు లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి.
అందుకే కర్ణాటక ఎన్నికల్లో గెలిచి లోక్ సభ ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. కర్ణాటకలో అధికారం చేపట్టి దక్షిణాదిలో సత్తా చాటాలని ఉవ్విళ్ళురుతోంది బీజేపీ. అయితే కన్నడనాట విజయం ఈసారి అంత ఈజీ కాదని బీజేపీ హైకమాండ్ గుర్తించింది. అందుకే పవర్ లోకి వచ్చేందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయో పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల హీరోల ఇమేజ్ ను కన్నడనాటన వాడుకోవాలని భావిస్తోంది.
కర్ణాటకలో తెలుగు హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 60నుంచి 65స్థానాల్లో తెలుగు ఓటర్లు గెలుపును ప్రభావితం చేయగలిగే సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఈ స్థానాలు బీజేపీకి గంపగుత్తగా కమలం ఖాతాలో పడాలంటే టాలీవుడ్ హీరోల ఇమేజ్ ను వాడుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కన్నడనాటన జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ , అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ లకు మంచి ఆదరణ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ హీరోలను బీజేపీ తరుఫున ప్రచారం చేపట్టేలా ఆ పార్టీ నాయకత్వం చర్చలు జరుపుతోందని ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా ఎన్టీఆర్ కు కర్ణాటక సర్కార్ ఎవరూ ఊహించని విధంగా ప్రాధాన్యత కల్పిస్తుండటం ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది. వరుసగా అగ్రనేతలు తెలుగు హీరోలతో భేటీలు కావడం ఇందులో భాగమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఆ మధ్య తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు. భేటీ ఎజెండా బయటకు రాలేదు కానీ ఈ సమావేశంలో రాజకీయ పరమైన చర్చలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. అనంతరం కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డును ప్రకటించగా..ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అతిథిగా ఎన్టీఆర్ కి గౌరవం కల్పించింది. ఆ తర్వాత తారకరత్న బెంగళూరులో చికిత్స పొందుతున్న సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు నేరుగా ఆ రాష్ట్ర మంత్రి వెళ్లి ఆయనతో పాటు ఉండి ఆసుపత్రిలో పరిస్థితిని తెలుసుకొని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
అలాగే ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసింది. ఇటీవల హోం మంత్రి అమిత్ షా చిరంజీవి, రామ్ చరణ్ తో సమావేశమై వారిని అభినందించారు. ఇవన్నీ ప్రణాళిక ప్రకారమే బిజెపి నాయకులు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా ప్రచారం చేయించుకోవాలని బిజెపి అగ్రనాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగానే వారికి గత కొన్నాళ్లుగా అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తోను బిజెపి నాయకులు సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిసింది. గతంలో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు బిజెపి నుంచి ఎంపీగా పనిచేశారు. దీంతో బీజేపీ అగ్ర నాయకులతో ప్రభాస్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇలా తెలుగు హీరోలతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్న బీజేపీ వారితో కన్నడనాట ప్రచారాన్ని చేయించాలని భావిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో బిజెపి పొత్తులో ఉంది. ఈ పొత్తులో భాగంగానే కర్ణాటకలోనూ పవన్ కళ్యాణ్ తో ప్రచారాన్ని చేయించుకోవాలని బిజెపి నాయకులు భావిస్తున్నారు.
ఐతె తెలుగు హీరోలను నేరుగా ప్రచార పర్వంలో భాగం చేస్తారా..? లేక సామజిక మాధ్యమాల ద్వారా మాత్రమే వారి సేవలను వాడుకుంటారా..? అన్నది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.
Also Read : తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ – జూ. ఎన్టీఆర్ కు కీలక బాధ్యతలు..?