బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసి సస్పెన్షన్ కు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరనున్నారు. మే మొదటి వారంలో ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. మే 4 లేదా 5వ తేదీన హైదరాబాద్ లో టీ. కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. ఈ సభలోనే ప్రియాంక సమక్షంలో పొంగులేటి, జూపల్లికృష్ణారావులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
పొంగులేటి శ్రీనివాస్ , జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఇప్పటికే పొంగులేటితో రాహుల్ టీమ్ సంప్రదింపులు జరిపి…ఆయన కాంగ్రెస్ లో చేరితే ఎలా ఉంటుంది..? బీజేపీలో చేరితే ఏం జరుగుతుంది..?అనే విషయాలను పూసగుచ్చినట్లు వివరించింది. తాము చెప్పిన అంశాలపై నమ్మకం కుదరకపోతే సొంతంగా సర్వే చేయించుకొండని సూచించింది. ఈ క్రమంలోనే తెలంగాణలో నిర్వహిస్తోన్న సభకు ప్రియాంక గాంధీ మొదటిసారి వస్తుండటంతో అదే సభలో భారీగా చేరికలు ఉండాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందుకోసం గురువారం ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత రేణుకా చౌదరి నివాసంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంశంపై రేవంత్ చర్చలు జరిపారు. గంటపాటు ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. పొంగులేటిని కూడా సంప్రదించారని ప్రియాంక గాంధీ సభలో ఆమె సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఖమ్మం జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో తన అనుచరులకు టికెట్లు ఇవ్వాలని పట్టుబడిన పొంగులేటికి రేవంత్ ఎలాంటి హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారనేది తెలియాల్సి ఉంది.
జూపల్లి కృష్ణారావుతో రేవంత్ నేరుగా టచ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానం పలికినట్లు సమాచారం. బీఆర్ఎస్ పై పోరాడేందుకు కాంగ్రెస్సే సరైన వేదిక అని రేవంత్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏమాత్రం బలం లేని బీజేపీలో చేరి రాజకీయ భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని జూపల్లితో రేవంత్ అన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కు ఆశాజనకమైన పరిస్థితి కనిపిస్తోందని ఈ సమయంలో మీలాంటి కీలక నేతలు తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలను మార్చివేస్తాయని సూచించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో జూపల్లి కృష్ణారావు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలోనూ ఆయన సన్నిహిత నేతలు, అనుచరులు కాంగ్రెస్ లో చేరాలనే చెప్పడంతో జూపల్లి కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈమేరకు ప్రియాంక గాంధీ పర్యటనలో ఆమె సమక్షంలో ఈ పొంగులేటితోపాటు జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.
Also Read : రంగంలోకి రాహుల్ టీమ్ – పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారా..?