తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ కవితను లిక్కర్ క్వీన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై తమకు ఫిర్యాదులు అందాయని పోలీసులు చెబుతున్నారు. అందులో భాగంగానే మాదాపూర్ లోని ఎస్కే కార్యాలయంపై దాడి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆఫీసులోని కంప్యూటర్లను తీసుకెళ్ళడంతోపాటు నలుగురు ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. నోటిసులు కూడా ఇవ్వకుండా ఆఫీసును ఎలా సీజ్ చేస్తారని, అసలెలా ఆఫీసులోకి చొరబడుతారని ప్రశ్నించారు. ఈ అంశంపై పోలీసులు తాజాగా వివరణ ఇచ్చారు.
రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు కాని, మహిళలను కించపరిచేలా పోస్టింగ్ లు పెట్టారని.. మార్ఫింగ్ ఫోటోలతో ఇలా చేయడం నేరమని చెప్పారు. టీఆర్ఎస్ , బీజేపీ సోషల్ మీడియా అర్గనైజర్లు చేసే పోస్టింగ్ లు మరీ దారుణంగా ఉంటాయి. లిక్కర్ క్వీన్ కవిత అంటూ ఢిల్లీలో బీజేపీ నేతలు ఎన్నిసార్లు ట్రెండింగ్ చేశారో లెక్కే లేదు. కాని కాంగ్రెస్ పార్టీ పోస్టులు పెట్టగానే.. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను సీజ్ చేసి, కంప్యూటర్లు ఎత్తుకెళ్ళారు.
వీటిపై, పోలీసులు వివరణ కోసం ఎస్కే టీంకు నోటిసులు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు చెప్తుండగా, పోలీసులు మాత్రం నోటిసులు ఇచ్చామని చెబుతున్నారు. ఆ తరువాతే ఆఫీసును సీజ్ చేసామని ప్రకటించారు. అదుపులోకి తీసుకున్న ఉద్యోగులను ప్రశ్నించగా ఎస్కే చెబితేనే మార్ఫింగ్ చేశామని చెప్పారని..ఆయనకు కూడా నోటిసులు ఇస్తామని చెప్పుకొచ్చారు. అంటే ఈ లెక్కన సునీల్ కనుగోలును కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
సునీల్ కనుగోలు కాంగ్రెస్ కు స్టాటజీలు రూపొందిస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సూపర్ సక్సెస్ వెనక ఎస్కే కనిపించని శక్తిగా ఉన్నారు. అందుకే ఆయన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇదంతా బీజేపీ గేమ్ ప్లాన్ లో జరుగుతుందన్నారు.