వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా అధికారులపై దాడి కోసం ముందు నుంచి పథకం రచించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే 46 మంది నిందితులను గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ-1గా ఉన్న బోగమోని సురేష్ తో పాటూ పలువురు పరారీలో ఉన్నారు. అయితే దాడిలో పాత్రధారిగా ఉన్న సురేష్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇక ఈ ఘటనలో సురేష్ ను వెనుకుండి ఎప్పటికప్పుడు సూచనలిస్తూ నడిపించిన బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టర్ పై దాడికి కొన్ని గంటల ముందు, ఆ తర్వాత కాల్స్ లిస్ట్ పరిశీలించిన పోలీసులకు కీలక సమచారం లభించింది. ఏ-1 సురేష్ కు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి నుంచి ఏకంగా 50 సార్లకు పైగా కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. ఈ విషయంపై మీడియా నిలదీయడంతో …అవును అతను మా కార్యకర్తే అని కూడా నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారు. పార్టీ పనుల కోసం ఫోన్ చేయడం కూడా తప్పేనా అంటూ బుకాయించారు. అయితే దాడి జరిగిన రోజు సురేష్ నుంచి ఎందుకు అన్ని సార్లు కాల్స్ వచ్చాయి. ఇద్దరి మధ్య జరిగిన సంబాషణలు ఏంటి అన్నది నరేందర్ రెడ్డి నుంచి విచారణలో తెలుసుకోనున్నారు పోలీసులు.
అయితే సురేష్, నరేందర్ రెడ్డి మధ్య 50 ఫోన్ కాల్స్ జరుగగా…ఇక్కడ మరో సంచలన విషయాన్ని గుర్తించారు పోలీసులు. ఒకవైపు సురేష్ తో మాట్లాడుతూనే, మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో 23 సార్లు ఫోన్ లో మాట్లాడారు నరేందర్ రెడ్డి. దీనిపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు కలెక్టర్ సహా అధికారులపై దాడికి బీఆర్ఎస్ ముందస్తుగానే పథకం రచించిందన్న వాదనలకు ఈ కాల్స్ వ్యవహారం మరింత బలం చేకూర్చింది. దీంతో పాత్రధారుల మాట సరే…అసలైన సూత్రధారి అరెస్టు ఎప్పుడు అన్న చర్చ జరుగుతోంది. అయితే పోలీసులు నరేందర్ రెడ్డి కాల్స్ అంశంపై పక్కా ఆధారాలతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే అసలైన సూత్రధారి అరెస్ట్ కూడా తప్పదన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఫార్ములా ఈ -కార్ రేసు స్కామ్ లో అడ్డంగా బుక్కయ్యారు కేటీఆర్. త్వరలోనే గవర్నర్ అనుమతి వస్తే ఆయన్ను విచారించడం.. ఆ తర్వాత ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంపై ఏసీబీ దృష్టి సారించింది. ఇప్పుడు కలెక్టర్ పై దాడి కేసులోనూ పథకం రచించారన్న వార్తలకు బలం చేకూరుస్తూ ఆధారాలు బయటకు రావడంతో గులాబీ కార్యకర్తల గుండెల్లో బండలు పడ్డాయి. ఫార్ములా ఈ -కార్ రేసింగ్ కేసు నుంచి ప్రజల మూడు డైవర్ట్ చేసేందుకు కలెక్టర్ సహా అధికారులపై దాడికి కుట్ర చేస్తే…ఇది కూడా మెడకు చుట్టుకుందని మదన పడిపోతున్నారట పింక్ క్యాడర్.