ప్రధాని మోడీ హత్యకు కుట్ర జరిగిందంటూ ఎన్ఐఏ గుర్తించడం తీవ్ర కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాలపై విస్తృత సోదాలు చేస్తోన్న ఎన్ఐఏ ఈ సోదాల్లో ప్రధాని హత్యకు కుట్ర జరిగినట్లు తేలిందని పేర్కొంది. ఈ ఏడాది జూలైలో ప్రధాని పాట్నా పర్యటనలో హత్యకు విఫలయత్నం జరిగిందంటూ ఎన్ఐఏ గుర్తించింది. ఇందుకోసం పలువురికి శిక్షణ కూడా ఇచ్చారని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించామని తెలిపింది. యూపీకి చెందిన నేతలను సైతం మట్టుబెట్టేందుకు కుట్ర జరిగిందని పేర్కొంది.
దాదాపు 1000మంది కమాండోలతో రక్షణ వలయంలో ఉండే ప్రధానిని హతమార్చేందుకు ప్లాన్ చేస్తారా..? అది సాధ్యమేనా..? అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఐదు అంచెలో భద్రత వలయంలో ఉండే ప్రధాని భద్రత వ్యవహారాలను ఎస్పీజీ అధికారులు మినిట్ టూ మినిట్ పర్యవేక్షిస్తూ ఉంటారు. మొదటి వలయంలో కమాండోలు భద్రతగా ఉంటారు. రెండో లేయర్ లో వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులు పహారా కాస్తారు. మూడో వలయంలో జాతీయ స్థాయిలో ఉత్తమమైన పనితీరు కనబరిచిన భద్రత సిబ్బంది కాపలాగా ఉంటారు. నాలుగో అంచెలో పొలిసు అధికారులు భద్రతను కల్పిస్తారు. చివరి లేయర్ లో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన వాహన వ్యవస్థ ఉంటుంది. ఇందులో కమాండోలు, అధికారులతో కూడిన సిస్టం ఉంటుంది. ఈ వాహనంలో అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. ప్రధాని ఎక్కడికి వెళ్ళినా అక్కడ ముందుగానే పోలీసులు డ్రిల్ చేసి భద్రత వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇంతటి భద్రత వలయంలో ఉండే ప్రధానిని హతమార్చేందుకు కుట్ర జరిగిందనే వార్తలు అనేక సందేహాలను తెచ్చి పెడుతున్నాయి.
ఇప్పుడే కాదు…2019లోక్ సభ ఎన్నికల సమయంలోనూ ప్రధాని నరేంద్ర మోడీని హత్యా చేసేందుకు కుట్ర జరిగిందంటూ వామపక్షం భావజాలం కల్గిన వారిని అరెస్ట్ చేసి ఎల్లకాలంగా జైల్లోనే బంధించారు. ఇప్పుడు గుజరాత్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో ప్రధాని హత్యకు కుట్ర అంటూ మరోసారి సానుభూతి రాజకీయాల కోసం కుట్ర కోణం అల్లుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిజంగానే.. ప్రధాని హత్యకు ప్లాన్ జరిగి ఉంటె ఇదీ భద్రత వైఫల్యంగా చెప్పుకోవచ్చు అంటున్నారు. అలాగే, ప్రధాని భద్రత వ్యవహారాలు మరీ అంత తీసికట్టుగా మారుతున్నాయా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.