వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రణాళిక బద్దంగా సాగుతున్నారు. గతంలో చేసిన పొరపాట్లను గుర్తించి… వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని శత్రు పక్షానికి ఆయుధం అప్పగించవద్దని భావిస్తున్నారు. అందుకే పవన్ వారాహి యాత్రను ఎప్పుడు..? ఎక్కడ మొదలు పెట్టాలనే విషయంలో చాలా జాగురుకతతో అడుగులు వేస్తున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని వారాహి యాత్రను పోస్ట్ పోన్ చేశారు పవన్.
గత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయానికి ప్రతిపక్షాల అనైక్యత ఓ కారణమైతే.. మరో కారణం ఉద్యోగ , ఉపాధ్యాయ, నిరుద్యోగుల ఓటు బ్యాంక్ అంత వైసీపీ వైపు మొగ్గడమే. జగన్ ఇచ్చిన హామీలు అలాంటివి మరి. అధికారంలోకి వచ్చాక కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగిస్తామని..ఉద్యోగ బదిలీలలో పారదర్శకత పాటిస్తామని, ఉద్యోగ క్యాలెండర్ ను ప్రతి ఏటా రిలీజ్ చేస్తామని.. ప్రత్యేక హోదా సాధించి యువతకు ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తామని ఎన్నో.. ఇలా ఎన్నెన్నో. ఆకర్షణీయమైన హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నెరవేర్చడంలో జగన్ పూర్తిగా విఫలం కావడంతో.. ఆ వర్గం ఓటు బ్యాంక్ అంత వైసీపీపై గుర్రుగా ఉంది. ఈ వర్గాల అసంతృప్తిని బయట పెట్టుకునే అవకాశం ఎమ్మెల్సి ఎన్నికల ద్వారా వచ్చింది. అందుకే ఈ ఎన్నికల ఫలితాల తరువాత పవన్ తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలో 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు కాగా 3 పట్టభద్రులు స్థానాలు, 2 ఉపాధ్యాయ స్థానాలు ఉన్నాయి. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్ల లెక్కింపు. ఇందులో స్థానిక సంస్థల ఎమ్మెల్సి స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు కానీ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం వైసీపీకి గట్టి పోటీ తప్పదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పట్టభద్రులు జగన్ సర్కార్ పై పీకల్ దాక ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ప్రలోభల పర్వాన్ని వైసీపీ నేతలు షురూ చేసినట్టు తెలుస్తోంది.
ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఓ ఎమ్మెల్సీ స్థానం కాగా.. రెండోది కడప-అనంతపురం-కర్నూలు జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరి దృష్టి పడింది. జగన్ రాయలసీమలో తనకు ఎదురులేదని అనుకుంటున్నారు కానీ ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా వైసీపీ సర్కార్ పై వ్యతిరేకత ఉందా..? లేదా..? అనేది తేలనుంది. ఈ ఎన్నికల ఫలితాలు వైసీపీకి వ్యతిరేకంగా ఉంటే జగన్ సర్కార్ కు వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు. ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు అస్త్రంగా మారనున్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలతో విజయం సాధించినా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఆ ఛాన్స్ ఉండదు. నిరుద్యోగుల్లో జగన్ సర్కార్ పై అసంతృప్తి గూడుకట్టుకుపోయింది. ఉద్యోగ క్యాలెండర్ ను ప్రతి ఏటా రిలీజ్ చేస్తామని నమ్మించి మోసం చేశారని ఆగ్రహంగా ఉన్నారు. తమ అసంతృప్తిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యక్తపరుచాలని అనుకుంటున్నారు.
ఇకపోతే..ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ తోనే పవన్ తన వారాహి యాత్ర షెడ్యూల్ ను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను అనుసరించి వారాహి యాత్రకు సిద్ధపడుతున్నారు. అధికార పక్షానికి ప్రతికూల ఫలితాలు వస్తే ఒకలా.. అనుకూల ఫలితాలు వస్తే మరోలా యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఫలితాలు వచ్చిన కొద్దిరోజులకే వారాహి వాహనం రోడ్డెక్కే అవకాశం ఉంది. యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని పవన్ అన్ని సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే మార్చి 16 తరువాత పవన్ వారాహి తో రోడ్డెక్కనున్నారు.