కొండగట్టు అంజన్న సన్నిధిలో జనసేన పార్టీ ప్రచార రథం “వారాహి” వెహికిల్ కు ప్రత్యేక పూజలు చేయించారు పవన్ కళ్యాణ్. పవన్ రాకతో కొండగట్టు అంజన్న ఆలయం జనసేనాని అభిమానులతో కిక్కిరిసిపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పొత్తుల అంశంపై క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇప్పటికైతే బీజేపీతో పొత్తు కొనసాగుతుందన్న పవన్ కళ్యాణ్..కొన్ని అంశాల్లో బీజేపీ అధినాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో జనసేన పార్టీ రోల్ ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. పొత్తులపై తొందరేమి లేదని.. ఎన్నికల నాటికీ ఓ క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు.
ఏపీతోపాటు తెలంగాణలో శక్తిమేరకు జనసేన వాయిస్ వినిపిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొత్తవారు వస్తే కొత్తగా ఎన్నికలలోకి వెళ్తామని పవన్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఎవరూ తమతో రాకుంటే ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. బీఆర్ఎస్ పై స్పందించిన పవన్ మార్పు మంచిదే అంటూ వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన జనసేన నేతలు బీఆర్ఎస్ లో చేరడంపై మీడియా ప్రతినిధులు పవన్ ను ప్రశ్నించగా…కొందరు నాయకులు మార్పు కోరుకుంటారని అలాంటి వాళ్లు పార్టీ మారడం సహజమన్నారు.
అయితే…తెలంగాణలో తమకు ఎవరితో పొత్తు లేదని బీజేపీ ప్రకటించగా..పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీతో పొత్తు కొనసాగుతుందని వ్యాఖ్యానించడం విశేషం.