తెలంగాణ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ లోకి వలసలు మునుపెన్నడూ లేని విధంగా కొనసాగుతున్నాయి. ఇదివరకు బీజేపీ, బీఆర్ఎస్ లోకి మాత్రమే కొనసాగిన చేరికలు ఇప్పుడు ఆ రెండుపార్టీల్లోకి చేరికలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ లోకి మాత్రమే చేరికలు నడుస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ రేసులోకి వచ్చేసింది. బీజేపీ పూర్తిగా వెనకబడిపోయింది.
ఇటీవలే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావులు ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చేరికలతో కాంగ్రెస్ మంచీ టచ్ లో కనిపిస్తుండగానే ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత, బాల్కొండ నేత సునీల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది.
మంగళవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలతో సునీల్ రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం. 2018ముందస్తు ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన సునీల్ రెడ్డి బీఎస్పీ నుంచి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టించి రెండో స్థానంలో నిలిచారు సునీల్ రెడ్డి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో వేములకు ధీటైన అభ్యర్థి దొరికినట్లేనని నిజామాబాద్ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
అయితే ఇదే నియోజకవర్గం నుంచి రేవంత్ మద్దతుదారుడిగా ముద్రపడిన ఈరావత్రి అనిల్ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. అయితే.. సునీల్ చేరికపై అనిల్ తో రేవంత్ చర్చించారని అనంతరమే వీరి భేటీ జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.