‘ధరణి’ వల్ల భూఅక్రమార్కుల ఆట కట్టించవచ్చు అని కెసిఆర్ ప్రకటించగానే తెలంగాణ ధరణి మురిసిపోయింది. ఇక మా సమస్యలు తీరిపోయాయి అని ప్రజలు పండగ చేసుక్కున్నారు. ఇల్లు అలకగానే పండగ కాదుగా. అదే ఇప్పుడు కొంపముంచింది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్లు మారింది పరిస్థితి. వందో, వెయ్యే తీసుకుని పని చేసే ఏజెంట్ల, బ్రోకర్ల బెడద పోయి ప్రభుత్వ ఉన్నత అధికారులే ఏజెంట్లు, బ్రోకర్ల అవతారం ఎత్తారు. ఎందుకంటే ఒక్కసారి వెబ్ సైట్ లో నింపిన వివరాలల్లో మార్పులు – చేర్పులు చేయాలంటే ప్రభుత్వ ఉన్నత అధికారులే దిక్కు.
మొదటి స్టేజిలో ధరఖాస్తు అప్రూవల్ కావాలి. దానిని అప్రూవల్ చేయడానికి ఆయా అధికారి కోడి గుడ్డు మీద ఈకలు పీకడం మొదలు పెడతాడు. ‘మీకు ఎంత కావాలో చెప్పండి’ అని పాయింట్ కి వస్తే చాలు. ఓ ఫిగేర్ చెపుతాడు. పెట్రోల్ ధరలా దీనికి ఒక ఫిక్స్ రేటు ఉండదు. రోజు రోజుకు మారుతోంది. ఆ భూమి రేట్ ని బట్టి వీళ్ళ రేట్లు ఉంటాయి. పెట్రోల్ ధర పెరిగిన వెంటనే వీళ్ళ ధర కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. దీనికి రీజన్, లాజిక్ లు ఉండవు.
ధరణి లో మరో పెద్ద విభాగం ‘ప్రోహిబిటేడ్’ అనే దిక్కుమాలి విభాగం. అంటే ‘నిషేదించిన’ భూముల జాబితా. ఇది కలెక్టర్ మొదలు కింది స్టాయి ఉద్యోగి వరకు ఓ కల్పతరువు. ఏ చిన్న తప్పు దొరికినా కావాలని కొందరి భూములను ఇందులోకి తోసేస్తారు. ఇందులోంచి తొలగించాలంటే దానికి సపరేట్ రేటు ఉంటుంది. ఆ భూమి ఎన్ని ఎకరాలు ఉన్నది? దాని ధర వైట్ లో ఎంత? బ్లాక్ లో ఎంత? దానిలో ఎందరు పార్ట్నర్లు ఉన్నారు అనే దానిమీద రేట్ ఆధారపడుతోంది. ముఖ్యంగా అది పారిశ్రామిక భూమి అయితే పండగే. కనీసం 25 లక్షల నుంచి రేటు మొదలవుతుంది. దానికి అంతు లేదు.
అయితే ఇందులోంచి బిఆర్ఎస్ నేతలకు బంపర్ ఆఫర్ లాగా మినహాయింపు ఉంటుంది. సదరు నాయకుడితో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్లే. ఎందుకంటే ఈ ప్రభుత్వ అధికారులు చేసే అవినీతికి ఆ మంత్రులు, సిఎం అడ్డు పడవచ్చు. మీరు ఏం దోచుకోవాలనుకున్నా ప్రజల నుంచి దోచుకోండి. కానీ మా పార్టీ నాయకులనుంచి దోచుకుంటే తోలు తీస్తాం అనే సంకేతాలు ఎప్పుడో అందాయి. ఇలా అటు బిఆర్ఎస్ నాయకులు, ఇటు రెవెన్యు అధికారులు ఇష్టా రాజ్యంగా ధరణి ని దున్నుకుంటూ ముళ్ళ చెట్ల పంట పండిస్తున్నారు.