వచ్చే ఎన్నికలు టీడీపీకి సవాల్ గా మారాయి. మరీ ముఖ్యంగా నారా ఫ్యామిలీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు – లోకేష్ లు అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు సమయం సమీపిస్తు ఉండటంతో వరుస పర్యటనలతో చంద్రబాబు దూకుడు పెంచుతుంటే.. యువగళం పేరిట పాదయాత్రకు లోకేష్ శ్రీకారం చుట్టారు.
400రోజులు,4000కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర కొనసాగనుంది. లోకేష్ కు ఈ యాత్ర కీలకంగా మారింది. టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ రేంజ్ మరింత పెరుగుతుంది. అదే సమయంలో టీడీపీ ఓటమి పాలైతే ఆయన నాయకత్వంపై పెదవి విరుపులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం మెండుగా ఉంది. ఈ పాదయాత్ర ద్వారా వైసీపీ వైఫల్యాలను వివరించి పార్టీని అధికారంలోకి తీసుకువస్తే లోకేష్ ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు అవుతుంది. ఇక, ఇప్పటివరకు ఈ యాత్రలో టీడీపీ నేతలే పాల్గొనగా..జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఇటీవల ఓ సంఘటన బలం చెకూర్చబోతుంది.
లోకేష్ – ఎన్టీఆర్ ల మధ్య సత్సంబంధాలు లేవని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ చంద్రబాబు విషయంలో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నోరు పారేసుకుంటున్న… ఆయన తూతూ మంత్రంగా స్పందించారనే అభిప్రాయాలు వినిపించాయి. దాంతో రెండు ఫ్యామిలీల మధ్య మాటలు లేవనే ప్రచారం జోరుగా జరిగింది కానీ ఇటీవల ఎన్టీఆర్ భార్య ప్రణతి, లోకేష్ భార్య బ్రాహ్మణి ఓ చోట కలిసి చాలాసేపు గడిపారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. లోకేష్ – ఎన్టీఆర్ ల మధ్య సత్సంబంధాలు లేకపోతే ప్రణతి- బ్రాహ్మణిలు ఎందుకు పలకరించుకుంటారు. ఎన్టీఆర్ , లోకేష్ మధ్య గ్యాప్ అనేది సోషల్ మీడియా ప్రచారమేనని తేలిపోయింది.
తాజాగా లోకేష్ పాదయాత్రలో ఎన్టీఆర్ పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. యువ గళం పాదయాత్రలో ఎన్టీఆర్ పాల్గొంటే పాదయాత్రకు కాస్త హైప్ వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం పార్టీ నేతలు కూడా ఎన్టీఆర్ ను సంప్రదించారని.. నారా ఫ్యామిలీ – నందమూరి ఫ్యామిలీలు ఎన్టీఆర్ తో చర్చలు జరిపారని.. పాదయాత్రలో పాల్గొనాలని కోరగా ఎన్టీఆర్ కూడా అంగీకరించారని తెలుస్తోంది. ఇందుకు చంద్రబాబు పుట్టిన రోజు ఏప్రిల్ 20ను ముహూర్తంగా ఎంచుకున్నట్లు సమాచారం.