ఎన్టీఆర్.. తెలుగు వారి కీర్తిని నలుదిశలా చాటిన మహనీయుడు. బలహీనవర్గాలకు రాజకీయ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన నేత. మొదట సినీ రంగంలో తరువాత రాజకీయ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. జీవితాంతం నమ్మిన విలువల కోసం కట్టుబడిన రాజకీయ నేతలు అరుదుగా ఉంటారు అందులో మొదటివరుసలో నిలిచే నేత ఎన్టీఆర్ కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం. నేడు ఆ మహనీయుడి వర్థంతి.
ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజునే కాదు. సినిమా పండగ జరిగినా సంక్షేమ కార్యక్రమం నిర్వహించిన తప్పకుండా ఆయన గురించిన చర్చ తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా ఉండి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ముద్ర వేశారు మరి ఆయన. ఎన్టీఆర్ కాలం చేసి 27ఏళ్ళు అవుతున్నా.. ఇప్పటికీ ఆయన చిరస్మరణీయులుగానే ఉన్నారంటే.. ఆయన నటన ద్వారా, పాలన ద్వారా ఎలాంటి మార్పు , మార్క్ తీసుకోచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తెలుగు రాష్ట్రాల్లో నేడు కనిపిస్తోన్న చాలామంది రాజకీయ నేతలు ఎన్టీఆర్ నీడలో ఎదిగారు. ఆయన ప్రోత్సాహంతోనే అగ్రనేతలుగా చెలామణి అవుతుఇన్నారు. రాజకీయాలంటే కులం ఎక్కువ ఉండాలని అప్పట్లో చాలామందిలో అభిప్రాయం ఉండేది. కాని అదంతా తుడిచి పెట్టేస్తూ బీసీలకు , ఎస్సీలకు రాజకీయ రంగంలో విశేష స్థానం కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్. నాడు ఎన్టీఆర్ అందించిన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చి ఆయా వర్గాలను పైకి తీసుకురావడంలో రాజకీయ నేతలు విజయవంతమయ్యారు.
తెలంగాణలో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ప్రజలకు ఎన్నో బాధల నుంచి విముక్తి లభించింది. ఆయన ఇచ్చిన అవకాశాలతో రాజకీయంగా బీసీలు ఎదిగారు. ఈ రోజున తెలంగాణలో బీసీ నేతలు బలంగా తయారై సీఎం పదవికి కూడా పోటీ పడుతున్నారంటే అది ఎన్టీఆర్ చలవే.