కొత్త సంవత్సరం వచ్చేసింది. ప్రతి ఒక్కరికీ వందలాది సందేశాలు వస్తున్నాయి. ఏకబిగిన సోషల్ మీడియా వేదికగా విషెస్ ల పర్వం కొనసాగుతోంది. అయినా.. ఒకటే సందేహం. ఈ కొత్త సంవత్సరమైనా మన జీవితం మారుతుందా..? కేవలం క్యాలెండర్ లో ఇయర్ మారినంత సులువుగా మన జీవితం మారుతుందా..? అనే ప్రశ్న దాదాపు అందరి మెదళ్లలో నానుతోంది.
క్యాలెండర్ లో ఇయర్ మారినంత ఈజీగా మన జీవితాలేమి మారవు. కాని.. కొత్త సంవత్సరంలోనైనా కొన్ని లక్ష్యాలు పెట్టుకొని పని చేసేవారికీ న్యూ ఇయర్ కొత్త అనుభూతినిచ్చేదే. జీవితంలో స్థిరపడేందుకు ఈ కొత్త సంవత్సరాన్ని సవాల్ గా తీసుకొని పని చేయండి. వ్యసనాలు వదిలేసేందుకు ఈ ఇయర్ నుంచి మొదలు పెట్టండి. విజయవంతమైన స్నేహితులు , బంధువులను స్ఫూర్తిగా తీసుకుని గెలిచేందుకు ఈ ఇయర్ ను ఎంచుకోండి. లేకపోతే ఈ ఇయర్ కూడా నిర్లిప్తతతో నిండి ఉంటుంది..మరో ఏడాది కోసం ఇవే ఆశలతో ఎదురుచూడాల్సి వస్తుంది.
ఇక జీవితంలో అత్యధిక సమయాన్ని సోషల్ మీడియాలో.. రాజకీయం, సినిమా వంటి వాటి మీద ఖర్చు చేయకండి. అదే అన్ హ్యాపీ న్యూ ఇయర్ కు కారణం అవుతుంది. మన జీవితంలో వాటికెంత సమయం కేటాయించాలన్నది నిర్దేశించుకోవాలి. సినిమా అనేది వినోదం. బాగుంటే చూస్తాం లేకపోతే లేదు. అంతే కానీ కలెక్షన్ల గురించి సోషల్ మీడియాలోవాదనలు పెట్టుకోవాల్సిన పని లేదు. రాజకీయమూ అంతే.
రాజకీయ పార్టీల కోసం ఇతరులతో వాదించడం మూర్ఖత్వమే. అసలు వాటికీ ముగింపు ఉండనే ఉండదు. ఎడతెగని చర్చ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఇలాంటి విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకుని.. కుటుంబం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడితే.. హ్యాపీ న్యూ ఇయర్ అవుతుంది. కొత్త సంవత్సరం కొత్త కిక్ ను ఇస్తుంది.