డాక్టర్ కావాలనుకున్నాడు. లక్ష్య సాధనలో ఎన్నోసార్లు పడిపోయాడు. అనుకున్న లక్ష్యానికి నాలుగుసార్లు సుదూరంగానే ఉండిపోయాడు. నీ వలన కాదు. ఇక ముగించేయ్ అని కుటుంబ సభ్యులు. తెలిసినా వాళ్లు, ఇరుగుపొరుగు వాళ్ళ వెక్కిరింతలు. ఇన్ని అవమానాలు, ఒత్తిళ్ళ మధ్య ఓ యువకుడు ఐదో ప్రయత్నంలో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరాడు. 11 ఏళ్లకే పెళ్లి చేసుకుని 20ఏళ్లకు తండ్రి అయ్యి ఇప్పుడు నీట్ ర్యాంకర్ గా మారిన యువకుడి కథ ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.
ఇటీవల ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ – 2023) ఫలితాలు వచ్చాయి. వీరిలో 700కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు చాలామందే ఉన్నారు కానీ అందరిలో రాజస్తాన్ కు చెందిన రాంలాల్ భోయ్ మాత్రం అందరికంటే స్పెషల్. చిత్తోర్ గఢ్ జిల్లాకు చెందిన రాంలాల్ భోయ్ కు డాక్టర్ కావాలని ఆశ. కానీ అతనికి పదకొండేళ్ళ వయస్సులో పెళ్లి చేశారు. అప్పుడు అతను ఆరో తరగతి చదువుతున్నాడు. తన భార్య 18ఏళ్ళు నిండిన తరువాత ఓ కుమార్తెకు జన్మనిచ్చింది.
చదువుపై ఎంత ఇష్టం ఉన్నా పెళ్లి కాగానే కుటుంబ బాధ్యతల వలన దృష్టి మరల్తుంది. కానీ ఆ యువకుడు మాత్రం పట్టుదలగా చదివాడు. పదో తరగతి తరువాత ఏ గ్రూప్ ఎంచుకోవాలనే విషయంలోనూ అతనికి ఓ క్లారిటీ లేదు. కానీ సైన్స్ లో అతనికున్న ఆసక్తిని గమనించిన అతని టీచర్ ఒకరు బైసీపీ తీసుకోమని సూచించాడు. 81% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన రాంలాల్…ఎలాగైనా డాక్టర్ కావాలనుకున్నాడు.
డాక్టర్ కావాలని ప్రిపెరేషన్ మొదలెట్టాడు. నాలుగుసార్లు నీట్ పరీక్ష రాసినా 720కి 350, 320, 362, 490 ల చొప్పున మార్కులు సాధించగలిగాడు. దీంతో ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఒకటే దొబ్బుడు. డాక్టర్ కావడం నీ వలన అయ్యే పని కాదు కానీ, ఎంచక్కా మరో పని చూసుకొని కుటుంబానికి ఆసరాగా నిలబడు అనే వ్యాఖ్యలు అతని మనస్సును గాయపరిచాయి కానీ లక్ష్యాన్ని కాదు. అందుకే పట్టుదలతో చివరిసారి చదివి నీట్ యూజీ పరీక్షలో 632 మార్కులు సాధించాడు.
Also Read : భార్యాభర్తల అస్తికల కలశం? ఇది చరిత్ర ఎరుగని ప్రణయం – ఏ ధరిత్రి రాయని కావ్యం!