జాతీయ రాజకీయాలను ఏ క్షణాన మొదలు పెట్టారో కానీ కేసీఆర్ కు కాలం అస్సలు కలిసిరావడం లేదు. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల ఖర్చులు తాను చూసుకుంటానని ఆఫర్లు ఇస్తున్నా కేసీఆర్ ను విశ్వసించడం లేదు. విపక్ష పార్టీలు నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ ను ఆహ్వానించడం లేదు. అదే సమయంలో కేసీఆర్ మాత్రం తాను నిర్వహిస్తోన్న సభలు , సమావేశాలకు జాతీయ స్థాయి నేతలను తెలంగాణకు రప్పించుకొని తన బలాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు దాంతో కేసీఆర్ కు జాతీయ స్థాయిలో పట్టు దొరికిందని అనుకుంటుండగానే విపక్ష పార్టీలు కేసీఆర్ కు ఝలక్ ఇచ్చేశాయి.
ఇటీవల బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ సమావేశం అయ్యాయి. ఇందులో కీలక నేతలు పాల్గొన్నారు. మోడీతో డీ అంటే డీ అంటున్న కేసీఆర్ ను మాత్రం ఎవరూ ఈ విపక్ష పార్టీల సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం పంపలేదు. సందు దొరికితే చాలు మోడీని ఏకిపారేస్తూ మోడీ వ్యతిరేక శక్తిగా ప్రొజెక్ట్ కావాలనుకుంటున్నా కేసీఆర్ ను విపక్షాలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. కేసీఆర్ గత రాజకీయాలను పరిశీలించో లేక మరేదైనా కారణమో కానీ బీఆర్ఎస్ చీఫ్ ను మాత్రం బీజేపీ వ్యతిరేక పోరులో నమ్మదగిన వ్యక్తిగా విపక్ష నేతలు గుర్తించడం లేదు.
దండిగా డబ్బులుంటే జాతీయ రాజకీయాలు చేయవచ్చునని ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం.. ప్రాంతీయ పార్టీలకు చేస్తోన్న ఆఫర్లు చూస్తుంటే కేసీఆర్ డబ్బులతో రాజకీయ వ్యాపారం చేసినట్లుగా ఉందన్న అనుమానాలు ఉత్తరాది నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ గతంలో సమాజ్ వాదీ పార్టీతో పాటు జేఎంఎం, వైసీపీ, జేడీఎస్, ఆప్ వంటి పార్టీలకు ఆర్థిక సాయం చేసినట్లుగా ప్రచారం ఉంది. ఇప్పుడు ఆ రేంజ్ ను మరింత విస్తరించి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కలుపుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం తనను బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ చైర్మన్ ను చేస్తే ఎన్నికల ఖర్చు తాను చూసుకుంటానని కేసీఆర్ ఆఫర్లు ఇస్తున్నారన్న వార్త సంచలనం రేపుతోంది.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇటీవల ప్రత్యేక కూటమి ఏర్పాటు చేయాలనుకున్నారు. గతంలో కేసీఆర్ ఈ ఇద్దరు నేతలతోనూ కూటమి ఏర్పాటుపై చర్చలు జరిపాడు. తాజాగా అఖిలేష్ యాదవ్ తో టచ్ లోనే ఉన్నాడు. కానీ అఖిలేష్, మమతల నేతృత్వంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న కూటమిలో మాత్రం కేసీఆర్ ను చేర్చుకోవాలనుకోవడం లేదు. కేసీఆర్ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే తరహలో రాజకీయాలు చేస్తారని గ్రహించే ఆయనతో దూరం పాటిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
మొత్తంగా కేసీఆర్ ఆర్థిక సాయం అంటే అందరూ తన వెంటే వస్తారన్న నమ్మకంతో జాతీయ పార్టీ పెట్టారన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఆయన వెంట నడవడానికి మాత్రం ఒక్క పార్టీ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. మహారాష్ట్ర నుంచి దశాబ్దాల కిందట వార్డు మెంబర్లుగా గెలిచిన వారు వచ్చి కండువాలు కప్పించుకుంటు ఓ రేంజ్ లో ప్రచారం చేసుకుంటున్నారు కాని పార్టీకి పెద్దగా యూజ్ అయ్యే నేతలెవరూ బీఆర్ఎస్ వైపు తొంగి చూడటం లేదు.
Also Read : కేసీఆర్ రాజకీయ బేరాలు – బయటపెట్టిన రాజ్ దీప్ సర్దేశాయ్