అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ పై బీసీ లీడర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ , అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ లు బీసీ కోటాలో టికెట్ ఆశిస్తున్నారు.
గాలి అనిల్ కుమార్ సొంత నియోజకవర్గం నర్సాపూర్ కావడంతో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. పటాన్ చెరు నియోజకవర్గం నుంచి కూడా పోటీకి గాలి అనిల్ ఆసక్తి కనబరుస్తున్నారు. పటాన్ చెరు టికెట్ దక్కని పక్షంలో నర్సాపూర్ బరిలో నిలిచేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ గా కొనసాగుతోన్న ఆయన గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసి గణనీయమైన ఓట్లను సాధించారు. నర్సాపూర్, పటాన్ చెరు నియోజకవర్గాల్లో గాలి అనిల్ కు మంచి ఓటు బ్యాంక్ ఉన్నట్లు లోక్ సభ ఎన్నికల్లో తేలింది. దాంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు పక్కా ప్రణాళికతో గాలి అనిల్ కుమార్ ముందుకు సాగుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తు ఉండటంతో గాలి అనిల్ కుమార్ స్పీడ్ పెంచారు. వివిధ పార్టీలకు చెందిన నేతలకు గాలం వేస్తూ కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దేవాలయాల నిర్మాణాల కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు. పలు శుభ కార్యాలకు హాజరు అవుతూ క్యాడర్ తో నేరుగా సత్సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. టీపీసీసీ ఇస్తోన్న పిలుపులో భాగస్వామ్యం అవుతూనే నర్సాపూర్, పటాన్ చెరు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై నిత్యం గళం వినిపిస్తున్నారు.
ఆర్థికంగా కూడా గాలి అనిల్ కుమార్ బలవంతుడు. దాంతో గాలి అనిల్ కు పోటీనిచ్చే స్థాయిలో పార్టీలో మరో నేత కనిపించడం లేదు. ఆంజనేయులు గౌడ్ తోపాటు ఆవుల రాజిరెడ్డిలు టికెట్ ఆశిస్తున్నా వివాదరహితుడిగా ముద్రపడిన గాలి అనిల్ కుమార్ వైపే క్యాడర్ మొగ్గు చూపుతోంది. ఎలా చూసినా నర్సాపూర్ టికెట్ గాలి అనిల్ కు దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పైగా ఏఐసీసీ స్థాయి నేతల నుంచి అండదండలు ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశాలు.మరోవైపు ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా అని బయటకొచ్చిన లిస్టులోనూ గాలి అనిల్ కుమార్ పేరుండటం విశేషం.
Also Read : ప్రియాంక గాంధీ కోసం సీటు త్యాగం చేసేందుకు గాలి అనిల్ రెడీ..!