నందమూరి, అక్కినేని ఫ్యామిలీల మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. సీనియర్ ఎన్టీఆర్ , ఏయన్నార్ ల మధ్య ప్రత్యర్ధులు సైతం ఈర్ష్యపడే సాన్నిహిత్యం ఉండేది. మధ్యలో కొన్ని పొరపచ్చాలు వచ్చినా చివరిదాకా వారు ఆ అనుబంధాన్ని కంటిన్యూ చేశారు. కాని ఎన్టీఆర్, అక్కినేని వారసులు మాత్రం తండ్రుల అనుబంధాన్ని కొనసాగించడంలేదు. ఇటీవల ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ ఓ ఫంక్షన్ లో మాట్లాడుతూ.. అక్కినేని.. తొక్కినేని అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించి బాలయ్య ఆ చులకన భావంతో కామెంట్స్ చేయడానికి గల కారణం.. రాజకీయమే.
ఎన్టీఆర్, ఏయన్నార్ లు సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు. అక్కినేని కన్నతల్లి పున్నమ్మ ఎన్టీఆర్ ను తమ పెద్దబ్బాయిగా అభిమానించేవారు. అలాగే, ఏయన్నార్ ను సైతం ఎన్టీఆర్ తల్లి చిన్నబ్బాయిగా ట్రీట్ చేసేది. అలా అక్కినేని, నందమూరి ఫ్యామిలీల మధ్య క్లోజ్ రిలేషన్ షిప్ ఉండేది. ఎన్టీఆర్, ఏయన్నార్ లు ఇద్దరి కలిసి విదేశాలకు వెళ్ళాలనుకున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కు తీరిక లేక వీలు కాలేదు. ఏయన్నార్ మాత్రం వీలు చేసుకొని అమెరికా వెళ్ళారు. ఆ గ్యాప్ లో ఎన్నో వదంతలు వచ్చాయి. ఎన్టీఆర్ , ఏయన్నార్ కు పొసగడం లేదని అందుకే విదేశాలకు ఏయన్నార్ ఒక్కరే వెళ్ళారని ప్రచారం జరిగింది. ఆ తరువాత ఇద్దరు కలిసి శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా చేసి వదంతులకు తెరదించారు.
మద్రాస్ నుంచి తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ చేరాలంటూ భాగ్యనగరం చేరారు. ఆ సమయంలో ఎన్టీఆర్ , ఏయన్నార్ ల వర్గాలుగా ఇండస్ట్రీ చీలిపోయినట్లు వార్తలు వచ్చాయి. కొన్నాళ్ళపాటు ఇద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి. అయితే.. ఎన్టీఆర్ ను తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దగా చిత్రసీమ గుర్తించేది. అందుకు ఏనాడూ ఏయన్నార్ వ్యతిరేకత చెప్పలేదు. వారి మధ్య అన్నదమ్ముల రిలేషన్ ఉండటంతో ఒకరినొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకున్నారు.
బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ ఇద్దరి స్టార్ హీరోల సినిమాల విజయోత్సవ వేడుకలకు ఒకరినొకరిని అతిథులుగా పిలుచుకునే వారు. ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం విషయమై ఏయన్నార్ తో చర్చించారంటే ఇద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందొ అర్థం చేసుకోవచ్చ్చు.టీడీపీ అధికారంలో ఉండగా.. ఏయన్నార్ స్టూడియో కోసమని తీసుకున్న స్థలంలో టింబర్ డిపో నడుపుతున్నారని తెలిసి చర్యలు తీసుకుంది అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం. దాంతో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. అదే సమయంలో ఏయన్నార్ అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైనా..విబేధాలను పట్టించుకోకుండా ఆసుపత్రికి వెళ్లి ఏయన్నార్ ను పరామర్శించారు ఎన్టీఆర్. ఆ తరువాత స్థలమే నేడు అన్నపూర్ణ స్టూడియోగా నిలిచింది. స్థల విషయంలో ఎన్టీఆర్ , ఏయన్నార్ ల మధ్య ఏర్పడిన గ్యాప్ పెరుగుతూ పోయింది.
రామారావు చివరిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన్ను తెలుగు ఇండస్ట్రీ ఘనంగా సన్మానించింది. ఆ వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు ఎంతమంది వచ్చినా.. నా సోదరుడు ఏయన్నార్ రాకపోవడం నాకు వెలితిగానే ఉందని వ్యాఖ్యానించారు. నాకు తెలిసి తన విషయంలో నేనేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించాలట్లు వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలుసుకున్న ఏయన్నార్ తరువాత ఎన్టీఆర్ ను కలిసి ఆలింగనం చేసుకున్నారు. అప్పటి నుంచి చివరి వరకు ఇద్దరు సొంతఅన్నదమ్ములానే ఉండిపోయారు.
అక్కినేని ఫ్యామిలీకి బాలకృష్ణకు మధ్య అసలేం జరిగింది..?
ఎన్టీఆర్ తో ఏయన్నార్ అనుబంధం దృష్ట్యా ఈ రెండు ఫ్యామిలీలు పరస్పరం గౌరవించుకునేవి. ఎన్టీఆర్ వారసులంతా ఏయన్నార్ ను బాబాయ్ అంటూ ప్రేమతో పిలిచేవారు. బాలయ్య సినిమాలు సూపర్ హిట్ అయినప్పుడు బాలయ్యను ఏయన్నార్ స్వయంగా అభినందించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి బాబాయ్- అబ్బాయ్ ల మధ్య ఓ వేడుక మనస్పర్ధలు తీసుకొచ్చింది. ఏయన్నార్ కు సంబంధించిన ఓ వేడుక సుబ్బారామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అందులో నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తమ్ముడు రామకృష్ణ హాజరయ్యారు. అయితే… ఆ వేడుకలో పాల్గొన్న అందర్నీ వేదికపైకి పిలిచి రామకృష్ణను స్టేజ్ మీదకు పిలవకపోవడంతో అక్కినేనిపై బాలయ్య కోపం పెంచుకున్నారని టాక్. తరువాత ఆ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఈ గ్యాప్ ను దూరం చేయాలని నాగార్జున చొరవ చూపిన బాలయ్య ఇంట్రెస్ట్ చూపలేదని అంటుంటారు. కారణం ఏదైనా.. ఏయన్నార్ కన్నుమూసినప్పుడు బాలయ్య హాజరు కాలేదు. రెండు కుటుంబాల మధ్యనున్న చిన్న గ్యాప్ ఆ ఘటన తరువాత కలుసుకోలేనంత దూరం పెరిగేందుకు కారణమైంది.
పొలిటికల్ యాంగిల్
వీరసింహరెడ్డి విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ..అక్కినేని.. తొక్కినేని అనటం వివాదాస్పదమైంది. ఇందుకు కౌంటర్ గా నాగచైతన్య ఓ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, ఏయన్నార్ లు ఇద్దరు కళామతల్లి వారసులు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడమని ట్వీట్ చేశారు. దీనిని అఖిల్ రీట్వీట్ చేయడంతో ఈ విషయం ఇండస్ట్రీలో రచ్చకు కారణమైంది.
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023
అయితే.. ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం రాజుకోవడానికి కారణం ఉందట. ఇందులో రాజకీయం ఉన్నట్టు తెలుస్తోంది. వైజాగ్ లో నాగార్జున, బాలకృష్ణ కలిసిపోయారు. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉంది. ఆ కారణంగా బాలయ్య, నాగ్ తో సయోధ్యకు అంగీకరించారు. కాని ఇప్పుడు నాగార్జున వైసీపీతో సఖ్యతగా ఉంటున్నారు. అందువలన సహజంగానే బాలయ్యకు నాగార్జునపై వ్యతిరేకత ఉంటుంది. కాని బాలకృష్ణ రాజకీయ కోణంలో కాకుండా సినిమా వేడుకలో ఈ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.
రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం.. నందమూరి, అక్కినేని అభిమాన సంఘాల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా కనిపిస్తోంది.