ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ ఎవరికిస్తారనే దానిపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఈసారి తప్పకుండా కాంగ్రెస్ తరుఫున పోటీ చేస్తానని నాగం ఖరాఖండిగా చెబుతుంటే మరోవైపు దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి తెరవెనక టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. తన కుమారుడుతో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటానని వ్యాఖ్యానించిన దామోదర్ రెడ్డి చివరి నిమిషంలో వెనుకంజ వేశారు. నాగర్ కర్నూల్ టికెట్ పై కాంగ్రెస్ పెద్దల నుంచి స్పష్టత లేకపోవడంతోనే దామోదర్ రెడ్డి పార్టీ మార్పుపై ఆగిపోయారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నాగం జనార్ధన్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా కృష్ణారెడ్డి, సర్కార్ పెద్దల దోపిడీతోపాటు టికెట్ అంశంపై కూడా స్పందించారు. తనకు టికెట్ వస్తుందన్న ఆశాభావాన్ని నాగం వ్యక్తం చేశారు. టికెట్ కోసం అందరూ దరఖాస్తు చేసుకుంటే తాను కూడా అప్లై చేసుకుంటానని వ్యాఖ్యానించారు. కుమారుడికి టికెట్ ఆశిస్తోన్న దామోదర్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరలేదు. ఎన్నికల్లో గెలిచాక తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్లరని గ్యారంటీ ఏంటి? అంటూ ప్రశ్నించారు నాగం. ఈ అంశం అందర్నీ ఆలోచింపజేస్తోంది.
పలు అంశాలపై నిర్దిష్టమైన అవగాహనా కల్గిన నాగం జనార్ధన్ రెడ్డికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఐదేళ్ళుగా కాంగ్రెస్ క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. బిజినేపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తపై దాడి జరిగితే దళిత , గిరిజన ఆత్మగౌరవ సభను నిర్వహించి కార్యకర్తలకు కొండంత భరోసానిచ్చాడు. దామోదర్ రెడ్డి వర్గీయులు కాంగ్రెస్ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడినా , దాడులకు యత్నించినా వాటన్నింటిని ఎదుర్కొన్నాడు. తీరా ఎన్నికల సమయనా గతంలో పార్టీ కార్యకర్తలను వేధించిన నేతలకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ నాయకులు కూడా మద్దతు ఇచ్చే అవకాశం లేదు.
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం చేపట్టిన సర్వేలోనూ నాగం జనార్ధన్ రెడ్డి పేరు మొదటి ప్లేసులో వచ్చింది. దాంతో నాగంకు కాకుండా ఇతరులకు నాగర్ కర్నూల్ లో టికెట్ ఇస్తే స్వయంగా ఓటమిని ఆహ్వానించినట్లు అవుతుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read : ఏఐసీసీకి అందిన ఎస్కే టీమ్ నివేదిక – ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..!?