జనసేనలో నెంబర్ 2గా కొనసాగుతోన్న నాదెండ్ల మనోహర్ పార్టీని వీడే విషయమై సమాలోచనలు జరుపుతున్నారని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయనకు టీడీపీ నుంచి ఆహ్వానం అందిందని..దీంతో జనసేనతో కటీఫ్ చెప్పేందుకు మనోహర్ నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు.
టీడీపీ -జనసేన పొత్తు అంశంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకుండా చర్యలు తీసుకుంటానని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ ఆ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేవలం వైసీపీ అవలంభిస్తోన్న రాజకీయ విధానాలపై మాత్రమే చర్చించామని ఇరు పార్టీల వర్గాలు స్పష్టం చేశాయి. పొత్తులపై ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. కానీ,జనసేన కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ రెడీగా లేదు.దాంతో పొత్తులు చర్చలకే పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి,.
ఈ నేపథ్యంలో జనసేనలోకి వెళ్తారని అనుకుంటున్నా నేతలను చంద్రబాబు మెల్లగా టీడీపీలోకి లాగేసుకుంటున్నారు.మహాసేన రాజేష్ తోపాటు ఇటీవల కన్నా లక్ష్మి నారాయణలు జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగింది.కానీ చంద్రబాబు తనదైన రాజకీయం చేసి ఈ నేతలను టీడీపీలో చేర్చుకొని జనసేనకు షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాదెండ్ల మనోహర్ ను కూడా టీడీపీలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. దాంతో జనసేనను బలహీనపరిచి తమతో కలిసి వచ్చేలా చేయాలన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు.
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావును రంగంలోకి దింపి.. ‘ఆపరేషన్ మనోహర్’ ను సక్సెస్ చేయాలని బాధ్యతలు అప్పగించారని టాక్. రాయపాటికి నాదెండ్ల మనోహర్ తో మంచి పరిచయం ఉంది. ఇదివరకు ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో పని చేసిన నేతలు కావడంతో రాయపాటిని రంగంలోకి దింపి ‘ఆపరేషన్ మనోహర్’ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయాలనీ సూచించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..