పలానా రోజు మనం చస్తున్నాము అని కర్మ కాలి ముందే తెలిస్తే ఏం చేస్తాము? ముందు మనం ఏడుస్తాము, తరువాత మన వాళ్ళను ఏడిపిస్తాము. శోక సముద్రంలో మునిగి ఆ చావు రోజు కంటే ముందే గుండె పగిలి చస్తాము. ఆ నరకం అనుభవించకుండా ఒక్కసారిగా టక్కున ప్రాణం పోయింది మేలు. ఇదొక శాపం.
కానీ డాక్టర్ ఏపూరి హర్ష వర్ధన్ కి ఆ శాపం తగిలింది కాబోలు. లంగ్ క్యాన్సర్ వచ్చింది. అతను పుట్టింది ఖమ్మం. వృత్తి రీత్యా ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో జనరల్ మెడిసిన్ లో వైద్య సేవలు చేస్తున్నాడు. పది మందిని బ్రతికంచే అతనే చావు ముంగిట నిలిచాడు. డాక్టర్లు ముందుగా ఇచ్చిన డెత్ డేట్ మార్చి 27, 2023.
అతను బాధ పడలేదు. భయపడలేదు. అతని వయసు కేవలం 32 ఏళ్ళు మాత్రమే. అప్పటికే అతనికి పెళ్లయ్యింది. భార్య పేరు సింధు. ఎం ఎస్ సి చదివింది. పెళ్లి కాగానే ఆమెతో వారం రోజులు ఖమ్మం లో కాపురం చేయగానే అతను వృత్తి రిత్యా ఆస్ట్రేలియాకు వంటరిగా రావలసి వచ్చింది. పాస్ పోర్ట్ చేయించి భార్యను ఆస్ట్రేలియాకు రప్పించాలి అనుకున్నాడు.
కానీ ఈలోగా కరోనా అతనికోసమే వచ్చింది అనుకోవాలి. అతను ఇండియా రాలేని పరిస్టితి. భార్యను పిలిపించుకోలేని దుస్తితి. ఈ లోగా చావు వార్త అతనిని కదిలించింది. ఆ విషయం ఇంట్లో తెలిసి గుండెలు బాదుకున్నారు. కానీ అతనే వాళ్లకు మనో బలం ఇచ్చాడు. పుట్టిన వాడికి మరణం తప్పదు అనే గీతను భోదించాడు.
అసలే సింధు వాళ్ళ నాన్న ఆక్సిడెంట్ కు గురై ఎనిమిది సంవత్సరాలనుండి శరీరం చచ్చుబడి బెడ్ మీదనే ఉంటున్నాడు. ఓపికస్తురాలైన సిందూ తల్లి అన్నీ తానై చూసుకుంటుంది.
హర్ష వర్ధన్ తన గురించి ఆలోచించ లేదు. తాను చస్తే తన తల్లి, తండ్రి ఎలా బతుకుతారోనని దిగులు చెంది వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించాడు. ఇక వయసులో ఉన్న భార్యకు విడాకులు ఇచ్చి, ఓ మంచి కుర్రాడితో పెళ్లి చేయాలి అనుకున్నాడు. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదు. ఆస్ట్రేలియాకు వచ్చి సేవలు చేసి నిన్ను బతికించు కుంటాను అని బోరుమంది. అతను వినలేదు. కాలం అందరిని ఏడిపించింది. ఒక్క హర్ష వర్ధాన్ని తప్పా.
ఆ చావు రోజు దగ్గపడింది. సిడ్నీలో ఉండే సైంటిస్ట్ అయినా తన బంధువుని మార్చ్ 24 వ తారీకు రమ్మన్నాడు. మార్చి 23 తను రెగ్యులర్ గా వైద్య సేవలు అందించే ఆశ్రమానికి వెళ్ళాడు. నేను ఇండియాకు వెళ్తున్నాను అని వారి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. స్వతహాగా డాక్టర్ అయినా హర్ష కి పరిశుభ్రత అంటే ప్రాణం ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. స్వయంగా వంట చేసుకునేవాడు. జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ పిజ్జా బర్గర్ వంటి వాటిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. బాడీ ఫిట్ నెస్ అంటే ఇష్టం. దాని కొరకు ప్రతిరోజు జిమ్ చేసేవాడు. ఇవి అతనిని కాపాడలేదు.
వ్యాధి తీవ్రత తెలిసిన దగ్గర నుండి చికిత్స తీసుకుంటూనే ప్రతి క్షణం తన తల్లిదండ్రులను అత్యంత సున్నితంగా ఓదార్చాడు. ఆస్ట్రేలియాలో 100 మందికి పైగా అనాధల ఆశ్రమం ఉంది. వారికి ఎంతో ఓపికగా ప్రేమగా కావాల్సిన వైద్యం చేస్తూ తన బాధ మరిచిపోయాడు.
డాక్టర్ హర్ష కి వాళ్లు అన్న వారికి హర్ష అన్న పిచ్చి ప్రేమ. అందరికీ సహాయం చేసే సుగుణవంతుడైన డాక్టర్ హర్షకు ఇండియాలో, ఆస్ట్రేలియాలో అనేకమంది స్నేహితులు ఉన్నారు. స్నేహితుల మెసేజ్ పెడితే ఎంత పనిలో ఉన్నా ఖచ్చితంగా స్పందించేవాడు. సహాయం చేసేవాడు. ఇక హర్ష లేడు అనుకోమని స్నేహితులతో ముందుగానే మెంటల్ గా ప్రిపేర్ చేశాడు.
తన కోసం ఒక శవ పేటిక కొన్నాడు. తన శవాన్ని ఇండియాకు పంపడానికి విమానం టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. శవాన్ని తరలించే ఫోర్మాలిటిలు వేరుగా ఉంటాయి. అవన్నీ తానే పూర్తి చేసుకున్నాడు. ఇంతకీ డెడ్ బాడి ఎవరిదీ అని అధికారులు అడిగితే, తనదే అని చిరునవ్వుతో చెప్పాడు.
24 మార్చి ఉదయం బ్రౌన్ కలర్ జాకెట్ వేసుకొని తెల్లటి పాయింట్ తెల్లటి షూ ధరించి చక్కగా ఉన్నాడు. తన తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడాడు. అనంతరం స్నేహితులతో కలిసి టిఫిన్ చేసి వచ్చాడు. ఒక గంట తర్వాత మళ్లీ ఫోన్ చేస్తా అని తల్లికి చెప్పాడు. నాకు మళ్ళీ కాఫీ తాగాలనిపిస్తుంది వెళ్లొద్దాం పద అని స్నేహితులతో చెప్పాడు. ఇప్పుడే కదా తాగాము అని స్నేహితులు అన్నారు. వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఒక్కడే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి కాఫీ తాగి వచ్చాడు.
అనంతరం మూత్ర విసర్జనకు వాష్ రూమ్ కి వెళ్ళగా, మూత్రం బదులు రక్తం రావడం గమనించాడు. స్నేహితులకు చెప్పాడు. నేను మరొక గంట కంటే ఎక్కువ సమయం మీ ముందు ఉండకపోవచ్చు అని చిరునవ్వుతో చెప్పాడు. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా అని పడుకున్నాడు.
అంతే! రెండు నిమిషాల తర్వాత 32 సంవత్సరాల హర్ష వర్ధన్ శాశ్వత చితి నిద్రలోకి వెళ్లిపోయాడు. అంతిమ దశలో తన శవాన్ని తానే మోసుకుంటూ, తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు తనే స్వయంగా చేసుకొన్నాడు. ఇలాంటి ఆదర్శవంతుడిని ఏమంటారు? స్థితప్రజ్ఞుడు అంటారు. అతను చావలేదు. ఇలాంటి వాళ్ళకు మరణం ఉండదు. నలుగురికి మార్గదర్శిలా మారిన మృత్యుంజయుడు.