వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆయన కుమారుడు అవినాష్ రెడ్డికి భయం పట్టుకున్నట్లు ఉంది. నెక్స్ట్ అరెస్ట్ తనదేనని గ్రహించినట్లు ఉంది. అందుకే తనను అరెస్ట్ చేయడకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం మధ్యాహ్నం 2 : 30కు విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ధర్మసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది.
వివేకా హత్య కేసులో ఆదివారం భాస్కర్ రెడ్డిని పులివెందులలో అరెస్ట్ చేసిన సీబీఐ… అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తుందని ప్రచారం జరిగింది. పులివెందులలో అవినాష్ రెడ్డి కోసం వెతికినా ఆయన అక్కడ లేకపోవడంతో హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి నివాసానికి మరో సీబీఐ బృందం వెళ్ళింది. అక్కడ కూడా ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో అవినాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని సీబీఐ నోటిసులు ఇచ్చింది.
దీంతో అవినాష్ రెడ్డి ఐదోసారి విచారణ అనంతరం సీబీఐ అరెస్ట్ చేస్తుందని రాజకీయ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అవినాష్ రెడ్డికి కూడా ఇదే అనిపించినట్లు ఉంది. అందుకే ఆయన మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే.. ఇదివరకే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ విచారణాధికారిని మార్చాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించడం.. సీబీఐ కూడా ఒకే చెప్పడంతో అవినాష్ రెడ్డి రిలాక్స్ అయ్యారు.
ఇక తన అరెస్ట్ ఉండదని అనుకున్నారేమో కానీ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. తాజాగా సీబీఐ అవినాష్ రెడ్డి తండ్రిని అరెస్ట్ చేయడం…సోమవారం విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి నోటిసులు ఇవ్వడంతో ఆయన మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. అరెస్ట్ చేస్తారనే భయంతోనే అవినాష్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేసి ఉండొచ్చునని అంటున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా ఆయనకు హైకోర్టులో ఊరట లభించడం కష్టమేనని అంటున్నారు న్యాయనిపుణులు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!