బీజేపీలోకి కల్వకుంట్ల కవితను ఆహ్వానించారన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. లిక్కర్ స్కాం కేసును ముందుంచి కవితను బీజేపీలో చేరాలంటూ బెదిరించారని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యానించారు. బీజేపీపై బురదజల్లెందుకే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని.. తామెందుకు కవితను బీజేపీలో చేర్చుకుంటామని తెలంగాణ బీజేపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు.
కవితను బీజేపీలో చేరాలని అగ్రనేతలు ఆహ్వానించారా అని మీడియా ప్రతినిధులు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ప్రశ్నించగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితే బీజేపీలో చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేసిందని, తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్దమని కవిత చెప్పినట్లు అరవింద్ సమాధానం ఇచ్చారు. కవిత బీజేపీ నేతలకు టచ్ లోకి వెళ్లిందని తెలిసే.. తనను ఢిల్లీ నుంచి హడావిడిగా హైదరాబాద్ కు కేసీఆర్ తిప్పి పంపారని తెలిపారు.
అయితే, కేంద్రమంత్రి పదవి అడగటంతో ఆమె చేరికను పార్టీ పెద్దలు నిరాకరించారని అరవింద్ వ్యాఖ్యానించడం పలు అనుమానాలు లేవనెత్తేలా చేస్తోంది. అయితే, ఎలాంటి షరతులు విధించకుండా పార్టీలో చేరేందుకు కవిత ఇంట్రెస్ట్ చూపిస్తే అవినీతి మరకలు అంటుకున్న కవితను బీజేపీలో చేర్చుకునేవారా..? అన్న ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.
కేసీఆర్ మాత్రం తన కూతురిని బీజేపీలో చేరాలంటూ ఆ పార్టీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పగా.. అరవింద్ మాత్రం కవితే బీజేపీ లో చేరేందుకు ముందుకు వచ్చిందని కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. మొత్తానికి, కవితే బీజేపీని శరణు కోరడమో , బీజేపీనే కవితను అప్రోచ్ కావడమో జరిగి ఉంటుందని కేసీఆర్, అరవింద్ వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతుంది.