స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా చంద్రబాబు అరెస్ట్ జరిగిందని ఆరోపించారు. సుమారు ఏడెనిమిది లక్షల కోట్ల బడ్జెట్ ను హ్యాండిల్ చేసిన చంద్రబాబు…371 కోట్ల కోసం దిగజారతాడా అంటూ ప్రశ్నించారు మోత్కుపల్లి.
చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నట్లు చెప్పిన మోత్కుపల్లి..ఇందులోకి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా లాకొచ్చారు. కేసీఆర్ కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించాలన్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ పై కేటీఆర్ వ్యంగ్యంగా సంతోషాన్ని వ్యక్తం చేసేలా ట్వీట్ చేశారు. బహుశ కేసీఆర్ కూడా చంద్రబాబు అరెస్ట్ పట్ల ఇదే దృక్పథంతో ఉండి ఉంటారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. తమిళనాడు నుంచి వైగో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కాని కేసీఆర్ మాత్రం ఇంకా స్పందించలేదు.
బీఆర్ఎస్ లో మాధవరం కృష్ణారావు, వనమా వెంకటేశ్వర్ రావు, వివేకానంద్ గౌడ్ తో సహా పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. వీరి నియోజకవర్గాల్లో సెటిలర్ల ఓటు బ్యాంక్ అధికంగా ఉంటుంది కాబట్టి..ఈ ఎమ్మెల్యేలు స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మోత్కుపల్లి స్పందనే ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో జగన్ గెలవాలని.. చంద్రబాబు ఓడిపోవాలని శాపనార్ధలు పెట్టిన మోత్కుపల్లి ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం హాట్ టాపిక్ గా మారింది.
చంద్రబాబు అరెస్ట్ పై స్పందిస్తే ఏం జరుగుతుందోనని చాలామంది బీఆర్ఎస్ నేతలు సైలెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు మోత్కుపల్లి ఆ అంశంపై మాట్లాడారు. ఈ చర్చలోకి కేసీఆర్ ను తీసుకొచ్చారు. మరి మోత్కుపల్లి కోరినట్లుగా చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తారా..? మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ అనుమతి ఉందా..? అనే చర్చ జరుగుతోంది.
Also Read : సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు – టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ