మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. తన సూచన మేరకు కాంగ్రెస్ పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఈ ఉప ఎన్నికను ప్రత్యేకంగా వాచ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటని నివేదికలు తెప్పించుకుంటున్నారు. కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలతో సర్వేలు కూడా చేయిస్తూ రాజగోపాల్ రెడ్డితోపాటు పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు షా.
ఉప ఎన్నికల్లో గెలవడమే ధ్యేయంగా బరిలోకి దిగిన బీజేపీకి ఆర్థిక వనరులు పుష్కలంగా అందుతున్నాయి. ఒక్కో ఓటరుకు 40 వేలు ఇచ్చేందుకు వీలుగా డబ్బులను రెడీ చేసినట్లుగా బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అంతేకాదు.. మరికొంతమందికి డబ్బుల రూపంలో కాకుండా బంగారం రూపంలో తులం బంగారం ఇస్తామని వారికీ నచ్చిన డిజైన్ కూడా సిద్దం చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే.. ఇంత పెద్ద మొత్తంలో బీజేపీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి..? ఎలా ఖర్చు పెట్టగలుగుతున్నారనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది.
బీజేపీకి అందుతోన్న డబ్బంతా గుజరాత్ నుంచి తెలంగాణకు చేరుతున్నట్లుగా సమాచారం. పలు మార్గాల ద్వారా తెలంగాణలోని కీలకమైన, నమ్మిక కల్గిన బీజేపీ నాయకుల ఇంట్లో డబ్బును భద్రపరుస్తున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా కొద్ది, కొద్దిగా హైదరాబాద్ నుంచి మునుగోడుకు డబ్బును తరలించాలని బీజేపీ నేతలు ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలో మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద బీజేపీ నాయకులు కోటి రూపాయలు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ జయశ్రీ భర్త చొప్పరి వేణు వాహనంలో ఈ సొమ్ము పట్టుబడింది.