దేశంలో న్యాయస్థానాల తీర్పులను విని దేశమంతా ఆశ్చర్యానికి లోనవుతుంది. ఎక్కడ న్యాయం జరగకపోయినా చివరికి న్యాయస్థానంలోనైనా న్యాయం జరుగుతుందని విశ్వసించిన ప్రజలు మెల్ల మెల్లగా కోర్టు తీర్పులపై నమ్మకం కోల్పోతున్న స్థితి కళ్ళముందు కనిపిస్తోంది. కారణం వ్యవస్థలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ మేనేజ్ చేస్తుందన్న అనుమానాలు.
తాజాగా గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ విద్యార్హతలు అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు 25వేల జరిమానా విధించింది. మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి. ఎన్నికల అఫిడవిట్‌లో మోడీ చెప్పిన వాటి ప్రకారం ఆయన ఎక్కడ చదువుకున్నారో ఆధారాలు అడిగారు. సర్టిఫికెట్లు చూపించమన్నారు. ఇదే తప్పయిపోయింది. ఢిల్లీ సీఎం పిటిషన్ కొట్టేసి రూ. పాతిక వేలు జరిమానా వేశారు.
ప్రధాని మోడీ విద్యార్హతలు తెలుసుకోవాలని అనుకోవడంలో తప్పేమి ఉందొ ఎవరికీ అంతుబట్టడం లేదు. నిజానికి ఆయన విద్యార్హతలపై వివాదం చెలరేగకుండా ఆయనే స్వయంగా వాటిని బహిర్గతం చేసి ఉంటె బాగుండేది కాని ఆ పని చేయడం లేదు. దీంతో ప్రధాని విద్యార్హతలపై తీవ్ర దుమారం రేగుతోంది.
రాహుల్ గాంధీ విషయంలో సూరత్ కోర్టు న్యాయమూర్తి కన్నా గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తికి కాస్త విశాల హృదయం ఉన్నట్లుంది. రాజకీయ విమర్శ చేసిన రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్షను సూరత్ కోర్టు విధించినట్లు… ప్రధాని విద్యార్హతలను అడుగుతారా అని ఆగ్రహం వ్యక్తం చేసి గుజరాత్ హైకోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తే అరవింద్ కేజ్రీవాల్ మాజీ సీఎం అయ్యేవారు. కానీ హైకోర్టు 25వేల జరిమానా విధించింది.
గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా సామజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ప్రధాని విద్యార్హత అడిగితే జరిమానా వేస్తారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దేశంలో న్యాయం నాలుగు పాదాలా నడుస్తోందని సెటైర్లు వేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలా కోర్టుల నుంచి వెలువడుతున్న నిర్ణయాలు… విమర్శలకు కారణం అవుతున్నాయి.