తెలంగాణకు వచ్చి మోదీ తెచ్చింది ఏముంది ?
చెన్నైకి వెళ్లి రూ. 31 వేల కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపన
తెలంగాణలో కేసీఆర్ ది అవినీతి పాలన అంటూ విమర్శలు
మరి ప్రధానిగా ఉన్న మోదీ చర్యలు ఎందుకు తీసుకోరు ?
తెలంగాణ అంటే… ప్రధాని నరేంద్ర మోదీకి ఎందుకు అంత చిన్నచూపు ? కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు, అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల మంజూరు తీరుని గమనిస్తే.. ఎవరికైనా ఇదే ప్రశ్న అడాగలని అనిపిస్తుంది. ఒకవేల అలా అనిపించకపోతే ఒకటి.. వారికి దేశ పరిపాలనపై అవగాహన లేకుండా ఉండాలి లేదా రెండు.. వారు మోడీ భజన భక్తులైనా అయి ఉండాలి. కాంగ్రెస్ ధృడ సంకల్పంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన 2014 నుంచి నేటి వరకు .. ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చింది అరకొర నిధులే. ఆ ఇచ్చినవి కూడా హక్కుగా రాష్ట్రానికి రావాల్సిన వాటానే. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నేటికీ అమలు కాకుండా మోడీ అండ్ కో అడ్డుపడుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ తో పోరాటం చేస్తున్నట్లు నటిస్తూ… ఢిల్లీలో మాత్రం కలిసి రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతిపై నరేంద్ర మోదీ చర్యలు తీసుకోరు. అభివృద్ధి పరంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర బీజేపీ పెద్దలని కేసీఆర్ నిలదీయరు. ఒకరిపై ఒకరు నిందారోపణలతో రాజకీయ డ్రామాను మాత్రం రక్తికట్టిస్తారు.
దేశానికి ప్రధానమంత్రి అంటే.. అన్ని రాష్ట్రాలకు పెద్ద దిక్కు అన్నట్లే. ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్నారంటే.. కొత్త ప్రాజెక్టులు, నిధులు వస్తాయేమో అని ప్రజలు ఎదురుచూస్తారు. కానీ నరేంద్ర మోదీ మాత్రం.. ప్రజల ఆశలకు విరుద్ధం. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్విశతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు మే 26న ప్రధాని హైదరాబాద్ కు వచ్చారు. బహిరంగ సభలో పాల్గొని.. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందంటూ కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి తీవ్రంగా ఉందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి పేదల కష్టాలు పట్టవు అని ఎద్దేవా చేశారు. ఇలా… ఎప్పటిలానే మాయ చేసే మాటలు బాగానే మాట్లాడారు. కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తెలిసినా.. దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారు ? అవినీతి ప్రభుత్వ ఆగడాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ? మోదీ చేతిలోనే సీబీఐ, ఈడీ వంటి సంస్థలు ఉన్నాయి కదా. టీఆర్ఎస్ సర్కార్ అవినీతిని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధమని ప్రకటిస్తున్నారు కదా ? మరి.. మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు ? తెలంగాణకు వచ్చి దించేస్తాం, కడిగేస్తాం అని బీరాలు పలికే బదులు, కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి ప్రజాకోర్టులో దోషులుగా నిలబెట్టవచ్చు కదా ? కానీ అలా చేయరు. ఎందుకంటే… కేసీఆర్ – మోదీలది చీకటి మిత్రుల బంధం కాబట్టి. నమో నోట్ల రద్దు అంటే.. కేసీఆర్ జై కొట్టారు. పార్లమెంటులో ఏ బిల్లులు తీసుకొచ్చినా, మద్దతు ఇస్తారు. బయటకు వచ్చి మీడియా ముందు కొద్దిసేపు వ్యతిరేకించినట్లు డ్రామా చేస్తారు. అయినా… తెలంగాణలో ఏ మూలనో ఉన్న బీజేపీని, బండి సంజయ్ ద్వారా జాకీలు పెట్టి లేపేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ పై మోడీ ఈగ వాలనిస్తాడా ?
హైదరాబాద్ పర్యటన ముగించుకున్న మోదీ.. చెన్నై వెళ్లారు. అలా మద్రాసుకు మాత్రం ఉట్టి చేతులతో పోలేదు. రూ. 31 వేల కోట్ల విలువైన 11 కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులను తీసుకొని వెళ్లారు. ఆయా ప్రాజెక్టులకి శంకుస్థాపన కూడా చేసేశారు. బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. మార్క్ స్టైల్లో ఉపన్యాసం ఇచ్చారు కూడా. కానీ, తెలంగాణలో మోడీ వస్తుంటే, కేసీఆర్ బెంగళూరు వెళ్లి ముఖం చాటేసినట్లు … తమిళనాడులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ చేయలేదు. ప్రధానమంత్రి సభలో పాల్గొన్నారు. మోడీ ఎదుటే తమిళనాడుకి హక్కుగా రావాల్సిన నిధులు, హక్కులపై మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించారు. తమిళవాదాన్ని వినిపిస్తూ.. ద్రవిడ మోడల్ పాలనను యావత్ దేశానికి చూపిస్తామన్నారు. కేంద్రం నుంచి తమిళనాడుకు నిధులు రావడం లేదని ప్రధాని ముందే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తేల్చి చెప్పారు. రాష్ట్రాలతో కేంద్ర కలిసి పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని కూడా ఆయన తెలిపారు. తమిళనాడుకు కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులను విడుదల చేయాలని కూడా సభా వేదికగానే మోదీని స్టాలిన్ కోరారు. మరి మన కేసీఆర్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ఢిల్లీలో గత్తర లేపుతా, మెడలు వంచుతా, భూకంపం పుట్టిస్తా అని డైలాగులు కొట్టడం తప్పితే ముఖం పట్టుకొని కేసీఆర్ ఏనాడైనా తెలంగాణ కోసం మోడీ నిలదీశారా ?
దేశానికి ఇలాంటి ప్రధాన మంత్రి, రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు… తెలంగాణ రాష్ట్రానికి ఈ తిప్పలు తప్పేలా లేవు. రాష్ట్ర అభివృద్ధికి మోడీ నిధులు కేటాయించకున్నా, ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేసినా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోయినా, జాతీయ విద్యాసంస్థలు మంజూరు చేయకున్నా.. సీఎం కేసీఆర్ స్పందించరు. రాష్ట్రంలో కేసీఆర్ ఎంత అవినీతి చేసినా మోడీ చూసీ చూడనట్లు వదిలేస్తారు. ఇద్దరూ కలిసి రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తారు.. !!