మోడీ అధికారంలోకి వచ్చాక పేదలు మరింత దారిద్ర్యంలో కూరుకుపోతుండగా.. ధనవంతులు మరింత కుబేరులు అవుతున్నారు. ఆందోళన కల్గించే మరో విషయం ఏంటంటే.. మధ్య తరగతి ప్రజలు కూడా పేద వర్గాల్లో కలిసిపోతున్న దుస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ బీజేపీ హయంలోనే పేదల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని గాలి మాటలు చెబుతున్నారు. ఇవన్నీ భూటకమేనని తాజాగా స్పష్టమైంది.
భారత్‌లో ఉన్న మొత్తం సంపదలో నలభై శాతం ఒక్క శాతం సంపన్నుల వద్దే ఉంది. అట్టడుగుననున్న సగం జనాభా వద్ద దేశ సంపదలో కేవలం 3శాతం మాత్రమే ఉందని ప్రముఖ హక్కుల సంస్థ ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ సర్వేవల్ ఆఫ్ ది రిచెస్ట్ పేరిట భారత్ లోని ఆర్ధిక అసమానతలపై నివేదిక విడుదల చేసింది. దావోస్ లో జరుగుతోన్న ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశం సందర్భంగా ఈ నివేదిక విడుదల చేసింది.
ఇండియాలో పేదలు, ధనికుల మధ్య అంతరం తీవ్రంగా పెరిగిపోతుందని వెల్లడించారు. ఆక్స్ ఫామ్ నివేదికలో సంచలన విషయాలు ఉన్నాయి. అతి తక్కువ సంపద ఉన్న పేదలే.. ధనవంతుల కంటే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నారు. ఈ పన్నుల కారణంగా వారు మరింత పేదలవుతున్నారు. కుబేరులు మరింత కుబేరులవుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.
దేశంలోని టాప్ 10 మంది కార్పొరేట్ల వద్ద రూ.27.52 లక్షల కోట్ల సంపద ఉంది. 2021 నాటి సంపదతో పోల్చితే దాదాపు 9 లక్షల కోట్లు పెరుగుదల ఉంది. కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబరు వరకు దేశంలో బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగింది. కానీ వీరు కట్టే పన్నులు మూడు శాతం సంపద మెజార్టీ పేద ప్రజలు కట్టే పన్ను కన్నా తక్కువే ఉండటం గమనార్హం.
2021-22లో దేశంలో వసూలైన రూ.14.83 లక్షల కోట్ల జిఎస్‌టి ల్లో 64 శాతం రాబడి కూడా అట్టడుగున ఉన్న 50 శాతం మంది నుంచి వచ్చిందే. అంటే పన్నుల రూపంలో పేద, మధ్యతరగతి ప్రజలను ఏ స్థాయిలో ప్రభుత్వం పిండేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆకలి సూచిలో కూడా భారత్ దిగువ స్థాయికి చేరుతుండటం మోడీ పాలనకు మచ్చు తునకగా నిలవడం మాత్రం ఖాయం. దేశ భక్తి ముసుగులో పాలన కొనసాగిస్తోన్న దేశ పాలకులు..ఈ విషయాలను ప్రజలకు చేరువ కాకుండా చేయడంలో సఫలీకృతం అవుతున్నారు.