కోదండరాం…మలిదశ తెలంగాణ ఉద్యమ సారధి. రాజకీయ పార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన మేధావి. ఉద్యమ చరిత్రలో చెరిగిపోని ఘట్టాలుగా గుర్తుండిపోయే మిలియన్ మార్చ్, సాగర హారం వంటి ఉద్యమాలు ఆయన సారధ్యంలో జరిగినవే. ఉద్యమ కాలంలో ఎన్నో ఒత్తిళ్ళు, మరెన్నో సవాళ్ళు. అయినా వాటిన్నింటిని ఎదుర్కొని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు వ్యూహం రచించిన ఉద్యమకారుడు.
అలాంటి కోదండరాముడిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా విషం కక్కుతోంది. పదవుల కోసం వెంపర్లాడుతున్నాడని చిల్లర ఆరోపణలు చేస్తోంది.పదవులే ముఖ్యం అనుకుంటే రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోనే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాజ్యసభ సీట్ ను కోదండరాంకు ఆఫర్ చేశారు. కానీ తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాను తప్పితే పదవులు అక్కర్లేదని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత కేసీఆర్ అవలంభించిన విధానాలు, నిరుద్యోగ ర్యాలీకు పిలుపునిచ్చినప్పుడు ఆయన పట్ల బీఆర్ఎస్ సర్కార్ వ్యవహరించిన తీరు ఉద్యమకారులను ఆవేదనకు గురి చేశాయి. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే వస్తున్న కోదండరాం..ప్రస్తుత ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తున్నారు.
విద్యా రంగం ఎలా ఉండాలి..? ప్రజాస్వామ్య పరిరక్షణ అనే అంశాలపై కోదండరాం ఎప్పటికప్పుడు తన వాణిని వినిపిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇవేవి పట్టించుకోకుండా తాను జనంలో కనిపించడం లేదు. ఎమ్మెల్సీ రాలేదని అసంతృప్తిగా ఉన్నారని.. అందుకే మౌనం దాల్చారని సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారు. కోదండరాం హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండే మనిషి. జనంతో ఉండటానికి అమితమైన ఆసక్తి చూపించే నేత. అలాంటి నాయకుడిని జనంలో లేరంటే నమ్మదేలా అంటూ జనమే బీఆర్ఎస్ సోషల్ మీడియాకు కౌంటర్ ఇస్తున్నారు.