ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ షాక్ ఇచ్చింది. రెండోసారి విచారణకు హాజరు కావాలని గతంలో కవితకు ఈడీ నోటిసులు ఇచ్చింది. ఈ నెల 16న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని నోటిసుల్లో పేర్కొంది. ఇందుకోసం ఆమె ఢిల్లీ కూడా వెళ్ళింది. బీఆర్ఎస్ మంత్రులు కూడా ఆమెకు మద్దతుగా హస్తినలో వాలిపోయారు. కట్ చేస్తే…విచారణకు హాజరయ్యే సమయంలో నేటి విచారణకు హాజరు కాలేనని ఈడీకి తెలిపింది కవిత.
11 గంటలకు ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉన్నా కవిత ఆమె ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో కవిత నేటి ఈడీ విచారణకు హాజరు అవుతారా..?లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నివాసంలో కేటీఆర్ , హరీష్ రావుతో కలిసి న్యాయనిపుణులతో కవిత భేటీ అయినట్లు సమాచారం. ఆ తరువాత ఈడీ కోరిన సమాచారాన్ని సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌తో పంపించారు. తాను విచారణకు హాజరు కాలేను..అనారోగ్యం కారణాల వలన నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని ఈడీకి సమాచారం అందించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని పేర్కొంది.
కానీ ఈడీ మాత్రం కవిత వినతిని తోసిపుచ్చింది. ఈడీ విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నేటి విచారణకు ఈడీ పట్టుబట్టడం చూస్తుంటే కవిత అరెస్ట్ ఖాయమనే ప్రచారం మరింత ఎక్కువ అయింది. ఇక కవితను విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ ఆదేశించడంతో ఆమె విచారణకు వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. చూడాలి సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.
Also Read : కవితక్క సారా దందాలో తెలంగాణ అడబిడ్డలకు పొత్తుందా?