ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఈ కేసులో నిందితుడిగానున్న తుషార్ వెల్లపల్లి సీబీఐ విచారణ కోసం పట్టుబడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ సిట్ ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకే ఈ కేసును సీబీఐకి బదలాయించాలని కోరుతున్నట్లు చెప్పారు. తనకు సిట్ ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పినా లుక్ అవుట్ నోటిసులు ఇచ్చారని ఆధారాలను కోర్టుకు సమర్పించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అగ్రనేతలకు సైతం ప్రమేయం ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని సిట్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు నోటిసులు ఇచ్చింది. ఈ నోటిసులపై ఆయన హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. మరికొంతమంది బీజేపీ నేతలకు సిట్ నోటిసులు ఇచ్చేందుకు రెడీ అవుతుందన్న లీకులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్, అధికార ప్రతినిధి అనిల్ బలూనీ, క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఓం పాఠక్‌ల బృందం ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిట్ నుంచి సీబీఐకి అప్పగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఇప్పుడు తుషార్ సైతం ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టుకు వెళ్లారు. రాజకీయ నేపథ్యమున్న ఇలాంటి కేసులు సీబీఐకి గతంలో చాలానే అప్పగించబడ్డాయి. తుషార్ పిటిషన్ ను ఒకవేళ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడు ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నలుగురు ఎమ్మెల్యేలను సీబీఐ నిందితులుగా చేర్చి విచారణకు పిలుస్తుంది. దాంతో సీన్ రివర్స్ అవుతుంది.