కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తే రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రాన్ని హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటిసులు ఇవ్వడంతో ఆమెను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో శ్రీనివాస్ గౌడ్ ఈ రకంగా స్పందించారు. లిక్కర్ స్కామ్ లో కవితకు ప్రమేయం లేకపోతే ఆ విషయాన్నీ విచారణ సంస్థలు తెలుస్తాయి. కానీ కవితను విచారణకు పిలిస్తేనే బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గాబార పడుతుండటం ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు.
కేసీఆర్ కుటుంబమే టార్గెట్ గా బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తున్నారు. ఈడీ విచారణ అనంతరం లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించడం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు సంకేతం కాదా..? ఆయనకే తెలియాలి. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటిసులు జారీ చేస్తే మహిళలను, తెలంగాణను అవమానించినట్లేనని బీఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చిన వాదన సిల్లీగా అనిపించింది. కవిత ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి కూడా కాదు. అలాంటప్పుడు ఆమెకు నోటిసులు ఇస్తే… అందుకు తెలంగాణ ఎందుకు తలదించుకోవాలో బీఆర్ఎస్ శ్రేణులే చెప్పాలి.
కేసీఆర్ వెంట తెలంగాణ ప్రజలు ఉన్నారని.. రాజకీయంగా కేసీఆర్ ను ఎదుర్కొలేకే ఎమ్మెల్సీ కవితను అడ్డం పెట్టుకొని బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ ను ఇబ్బందులకు గురి చేయాలనుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గానున్న కేటీఆర్ ను వదిలేసి కవితను మాత్రమే కేంద్రం ఎందుకు టార్గెట్ చేస్తుందన్నది అందరి ప్రశ్న. ఈ లెక్కన చూస్తే… కవితకు లిక్కర్ స్కామ్ లో ప్రమేయం ఉన్నట్టే కదా అనేది విశ్లేషకుల వర్షన్.
ఇకపోతే.. అదాని దోపిడీకి మోడీ సహరించారని.. ఆ విషయాన్నీ వదిలేసి కవితను ఎందుకు టార్గెట్ చేశారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నిస్తున్నారు.అంటే… అదానిపై చర్యలు తీసుకోలేదు. కాబట్టి… కవితకు లిక్కర్ స్కాంలో ప్రమేయమున్నా విచారణ చేయొద్దు అనేలా శ్రీనివాస్ గౌడ్ పరోక్షంగా హెచ్చరించారు. దీంతో శ్రీనివాస్ గౌడ్ కవితను ఈ కేసులో కాపాడుకునేందుకు కామెంట్స్ చేస్తున్నారా.? లేక ఇరికించాలని ఇలా మాట్లాడుతున్నారో అర్ధం కాక బీఆర్ఎస్ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. పైగా… కేంద్ర నిఘా సంస్థలు ఫోకస్ చేశాక, అమిత్ షా తెలంగాణ టూర్ ఫిక్స్ అయ్యాక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా.. కేంద్రానికి , బీజేపీకి మరింత స్పేస్ ఇచ్చినట్లు అవుతుందనేది ఎనలిస్టుల అభిప్రాయం
అన్ని అంశాలను ఆలోచించకుండా ఎంతసేపు కల్వకుంట్ల కుటుంబం కరుణ కోసం ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని శాంతి భద్రతలకు విఘాంతం కల్గించేలా బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. బాధ్యతయుతమైన స్థానంలో కొనసాగుతున్న మంత్రులు ఇలాంటి కామెంట్స్ చేయడం ఏమాత్రం సరైంది కాదు. లిక్కర్ స్కామ్ విచారణలో అన్ని విషయాలు బయటపడుతాయి. ఈ విషయాన్ని మర్చిపోయి కేసీఆర్ ప్రాపకం కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలా..? విజ్ఞులైన వారు ఆలోచించాలి.