జంబలకిడి పంబ సినిమా గుర్తుందా..?అంత తేలిగ్గా మరిచిపోయే సినిమానా అది. ఆడవారు, మగవారుగా..మగవాళ్ళు ఆడవాళ్ళలాగా మారిపోయి కనిపించే సీన్స్ ఈ సినిమాలో హైలెట్ చేసి చూపించాడు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ.ఈ చిత్రంలోని ప్రతి సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. అయితే..ఈ మూవీలో మగవారు ఆడవారుగా,ఆడవారు మగవాళ్ళగా మారిపోయినట్లు రియల్ లైఫ్ లో ఎక్కడైనా జరుగుతుందా..? అంటే ఛాన్స్ లేదని కొట్టిపారేస్తాం.
కాని ఏపీలోని కర్నూల్ జిల్లాలో మాత్రం ప్రతి ఏడాది జంబలకిడి పంబ సీన్స్ కనిపిస్తుంటాయి. ఆదోని మండలం సంతేకుడ్లురు గ్రామంలో హోలీ సందర్భంగా రెండు రోజులపాటు మగవాళ్ళు ఆడవాళ్ళ వేషధారణలో కనిపిస్తారు. గ్రామంలోని ప్రతి మగాడు ఈ రెండు రోజులపాటు చీర కట్టుకొని ఆడవాళ్ళ మాదిరి కనిపిస్తూ ఉంటారు.
కర్ణాటక సరిహద్దులోని సంతేకుడ్లురు గ్రామంలో ఏళ్లతరబడి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. హోలీ సందర్భంగా మగవారు ఆడవారి వేషధారణలో పూజలు నిర్వహించడం వలన ఇంటికి మరియు గ్రామానికి మంచిదని అక్కడివారు అంటున్నారు. పండుగ రోజున పురుషులంతా ఆడవాళ్ళ వేషధారణలో రతీ మన్మధులను పూజిస్తారు. ఈ సంప్రదాయం ఆచరించడం వలన కోరిన కోరికలు తీరుతాయని చెబుతున్నారు.
ఆడవారు మాత్రం మగవారి వేషధారణలో కనిపించరు. కానీ మగవారికి ఆడ వేషం వేయడంలో సహాయం అందిస్తారు. ఇలా ప్రతిఏటా హోలీ సందర్భంగా ఏపీలో జంబలకిడి పంబ సీన్ కనిపిస్తుంటుంది.