ఇద్దరు పిల్లలు పుట్టాక ఇక చాలు అనుకునే వయసుమీరిన దంపతులకు, పెళ్లి కాగానే ఇప్పట్లో పిల్లలు వద్దనుకునే నవదంపతులకు, పెళ్ళికి ముందే గర్భం వస్తుంది అని భయపడే ప్రేమికులకు గొప్ప శుభవార్త. ఇకపై ఆడవాళ్ళు గర్బ నిరోదక మాత్రలు వాడవలసిన పని లేదు. ఇకపై మగవాళ్ళు వాడితే చాలు. అవును. మగవాళ్ళకు కూడా గర్భ నిరోధక మాత్రలు రాబోతున్నాయి.
అమెరికాలోని న్యూయార్క్ కి చెందిన వెయిల్ కార్నెల్ మెడికల్ స్కూల్ చేసిన ఈ పరిశోధన విజయవంతమైంది. ముందుగా ఎలుకల మీద ప్రయోగం చేసి ఫలితాలు రాబట్టి ఇప్పుడు మగవాళ్ళ మీద ప్రయోగాలూ చేస్తున్నారు. ఈ అద్భుత ప్రయోగం గురించి నేచుర్ కమ్యూనికేషన్స్ జర్నల్ ఈ నెల 14న ప్రచురించింది. ఇది ఎలా పనిచేస్తోందో వివరించారు.
ఈ మాత్ర మగవాళ్లలోని ఏ హార్మోనియానికి హాని తలపెట్టదు. మగవాడి వీర్యంలో చాలావరకు గంజిలాంటి జిగురు ద్రవమే ఉంటుంది. చాలా తక్కువ శాతంలో వీర్య కణాలు ఉంటాయి. అయితే ఈ వీర్య కణాలు యోని నుంచి గర్భాశయం వైపు ప్రయాణం చేయడానికి సాల్యుబుల్ అడేనైల్ అనే ప్రోటీన్ పెట్రోల్ లాగా పని చేస్తుంది. వీటి వల్లే స్త్రీ కి గర్భం వస్తుంది.
ఈ మాత్ర సాల్యుబుల్ అడేనైల్ ప్రోటీన్ శక్తిని పోగొడుతుంది. అంటే పెట్రోల్ లేని బండిలా జీవకణాలు యోనిలోనే ఆగిపోతాయి. అవి గర్భాశయంలోకి చొచ్చుకు పోలేవు. దాంతో గర్భం రాదు. ఈ మాత్ర వేసుకున్న ౩ గంటల నుంచి పని చేస్తుంది. 24 గంటల వరకు ప్రభావం చూపుతుంది. ఈ ప్రయోగం ఎలుకల మీద పని చేసింది కాబట్టి మగవాళ్ళ మీద కూడా ఖచ్చితంగా పని చేస్తుంది అని శాస్త్ర వేత్తలు చెపుతున్నారు.