మేకపాటి ఫ్యామిలీకు ఏపీ రాజకీయాల్లో మంచి ప్రాధాన్యత ఉంది. ఆర్థికంగా అత్యంత బలమైన మేకపాటి కుటుంబం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే వస్తోంది. ఈ క్రమంలోనే మేకపాటి శివచరణ్ రెడ్డి అనే యువకుడు కారణంగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు.
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అంటూ శివచరణ్ రెడ్డి అనే యువకుడు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. శివచరణ్ రెడ్డి తన చిన్నప్పటి ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలో చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ ఫోటోలను బయటపెట్టడంతో చంద్రశేఖర్ రెడ్డి మీడియా ముంగిటకు వచ్చి.. తనకు ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చారు. శివచరణ్ రెడ్డి ఎవరో తనకు తెలియదని చెప్పారు.
ఆ తరువాత శివచరణ్ రెడ్డి తల్లి మీడియా ముంగిటకు వచ్చి జరిగిన కథను చెప్పుకొచ్చారు. తనతో 18ఏళ్ళు చంద్రశేఖర్ రెడ్డి కాపురం చేశాడంటూ చెప్పుకొచ్చింది. తమను బెంగళూర్ లో రహస్యంగా ఉంచాడని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మి దేవి చెప్పుకొచ్చింది. తమను దూరం పెట్టినా బాధలేదని కాని.. డబ్బు కోసమే ఇలా చేస్తున్నామని మాట్లాడటం బాధించిందని ఆవేదన వ్యక్తం చేసింది.
తాజాగా శివచరణ్ రెడ్డి మరోసారి చంద్రశేఖర్ రెడ్డికి సవాల్ విసిరారు. నాన్నా.. నన్ను మీ కుమారుడిగా మీడియా ముఖంగా అంగీకరించండి. లేదంటే డీఎన్ఏ పరీక్షకు రండి అంటూ సవాల్ చేశారు. తాను ఇప్పటి వరకు చూపించిన ఆధారాలపై మీరు ఇంత వరకు స్పందించలేదని అన్నారు. తనకు మీ ఆస్తులు, రాజకీయ వారసత్వం అవసరం లేదని… కుమారుడిగా అంగికరిస్తే చాలని చెప్పారు. దీనిపై చంద్రశేఖర్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.