రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్ ఎట్టకేలకు పలు విషయాలను వెల్లడించాడు. తను ప్రీతిని మందలించిన మాట వాస్తవమేనని పోలిసుల విచారణలో అంగీకరించిన సైఫ్… తన మాటలతో మనస్తాపానికి గురై ప్రీతి ఆత్మహత్య చేసుకుంటుందని అంచనా వేయలేదని చెప్పినట్లు సమాచారం. మొదటి నాలుగు నాలుగు రోజులు విచారణకు సహకరించని సైఫ్ ను ఆ తరువాత పోలీసులు తమదైన శైలిలో విచారించగా నోరు విప్పాడు. సైఫ్ చెప్పిన విషయాలను రికార్డ్ చేసుకున్న పోలీసులు.. అతను చెప్పిన సమాధానాలతో మరింత సమాచారం రాబట్టారు.
ప్రీతి ఎమ్-01 లైట్ బ్లూ కలర్ మొబైల్ వాడేది. ఆమె ఫోన్లలోని సోషల్ మీడియా సంభాషణలు ఈ కేసులో కీలకం కానున్నాయి. వాటి ఆధారంగా పోలీసులు లోతైన దర్యాప్తు చేయనున్నారు. మరోవైపు ఆమె కీలకంగా ఉన్న మెడికో నుంచి ఎల్‌డీడీ, నాకౌట్ వాట్సాప్ గ్రూప్ నుంచి మూడు, డాక్టర్ గాయత్రి, డాక్టర్ సంధ్య నుంచి మూడు మెసేజ్ ల నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. అటు డాక్టర్ వైశాలి నుంచి ఆరు, సంధ్య నుంచి పది, డాక్టర్ స్పందన, సైఫ్ నుంచి ఒక్కో చాట్‌ను పోలీసులు సేకరించారు. వీటి ఆధారంగా విచారణ చేస్తే పలు కీలక విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది.
ప్రీతి కేసుకు సంబంధించి 9మంది నుంచి పోలీసులు వివరాలు రాబట్టారు. ప్రీతి ఆత్మహత్య చేసుకున్న రోజు ఎంజీఎం హెడ్ నర్స్ సునీత, స్టాఫ్ నర్స్ చిన్నపల్లి కళా ప్రపూర్ణ నుంచి పోలీసులు ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఇక ప్రీతి వాడిన బ్యాగులో పోలీసులు 24 ఆధారాలను సేకరించినట్టు సమాచారం. ఇవి కేసు విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది.ఇకపోతే.. సంఘటన స్థలంలో కూల్ డ్రింక్ , లెస్ ప్యాకెట్, వాటర్ బాటిల్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రీతి ఆత్మహత్య చేసుకున్న స్థలంలో ఇవి ఎందుకు వచ్చాయన్నది అంతుచిక్కడం లేదు. ఈ విషయమై దర్యాప్తు జరిపితే అసలు కోణం బయటపడే అవకాశం ఉంది.
ప్రీతితో వాట్సప్ గ్రూప్ లో వివాదం చోటుచేసుకున్నది నిజమేనని…ఆమెకు బ్రెయిన్ లేదని తాను అన్నట్లు సైఫ్ అంగీకరించాడు. కానీ ప్రీతి వీటిని సీరియస్ గా తీసుకొని ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదని సైఫ్ చెప్పినట్లు సమాచారం.