ప్రేమించిన అమ్మాయినిపెళ్లి చేసుకున్నాడు. ప్రేయసి కోసం పెద్దలను కూడా ఎదురించాడు. ఆ తరువాత పెద్దల మాటలకు కరిగిపోయి భార్య మృతికి కారణమయ్యాడు. ఈ విషాద ఘటన తూప్రాన్ మండలంలోని కోనాయిపల్లి (పిటి) గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ధర్మరాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన సాయిరెడ్డి యశ్వంత్ రెడ్డి అదే గ్రామానికి చెందిన తేజశ్రీలు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో అంగీకరించకపోవడంతో అక్టోబర్ 18తేదీన ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజే పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడంతో తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించింది. నూతన దంపతుల కుటుంబ సభ్యుల పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దాంతో యశ్వంత్, తేజ శ్రీలు కాపురం పెట్టారు. రెండు రోజులు కలిసిమెలసి ఉన్నారు. మూడో రోజు భర్త ఉద్యోగానికి వెళ్తున్నానంటూ తేజశ్రీకి చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడం.. ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో తేజ శ్రీ ఆందోళన చెందింది. ఆ తరువాత యశ్వంత్ తనను మోసం చేసినట్లు గుర్తించి కుటుంబ సభ్యులతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారం రోజులపాటు యశ్వంత్ కోసం గాలించి అదుపులోకి తీసుకున్నారు. ఇరువురిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. తనకు భార్య వద్దని యశ్వంత్ చెప్పడంతో అక్కడే ఉన్న తేజ శ్రీ షాక్ అయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా రెండు రోజులకే భార్య అంటే ఇష్టం లేదని యశ్వంత్ చెప్పడంతో ఖంగుతిన్నది. అటు తేజశ్రీ మాత్రం తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరడం.. భార్య వద్దని యశ్వంత్ చెప్పడంతో పోలిసులకు ఈ కేసు సవాల్ గా మారింది.
పోలీసులకు ఫిర్యాదు చేసిన తనకు న్యాయం జరగలేదని తేజ శ్రీ తీవ్ర మనస్తాపానికి గురైంది. నవంబర్ 19న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆర్వీఎం ఆసుపత్రిలో 43రోజులపాటు చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మోసానికి నిండు ప్రాణం బలి కావడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తేజశ్రీ మృతికి కారణమైన యశ్వంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
బాధితురాలికి న్యాయం చేసే వరకు తేజశ్రీ దహన సంస్కారాలు చేయమని యశ్వంత్ రెడ్డి ఇంటి ముందు చితిని పేర్చారు. జోక్యం చేసుకున్న సీఐ శ్రీధర్ నిందితుడిని వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు, హామీ ఇవ్వడంతో తేజశ్రీ దహన సంస్కారాలు నిర్వహించారు.