మర్పల్లి ఎమ్మార్వో గణేష్ నాయక్ వసూళ్ల పర్వం… ధరణిని అడ్డుపెట్టుకుని దందా.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ అధికారి ప్రధాన కర్తవ్యం. ఏవైనా సమస్యలు వస్తే తక్షణమే స్పందించి, పరిష్కార మార్గం చూపాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వ అధికారిపై ఉంటుంది. ఇలాంటి గౌరవనీయమైన స్థానంలో ఉంటూ కూడా వికారాబాద్ జిల్లా మర్పల్లి ఎమ్మార్వో గణేష్ నాయక్ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడు. అక్రమార్జనే ధ్యేయంగా, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దోచుకుంటున్నాడు. ప్రజలకు సేవ చేయాల్సింది పోయి తిరిగి వారినే పట్టి పీడిస్తున్నాడు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండల ఎమ్మార్వో గణేష్ నాయక్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అనేక అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈయన ఏ పని చేయాలన్నా చేయి తడపాల్సిందే. పైసలు ఇవ్వనిదే ఫైలు ముందుకు కదలదు. ధరణి పోర్టల్‌లో మార్పులొచ్చాక ఎమ్మార్వో గణేష్ నాయక్ వ్యవహారం మరింత ముదిరిందని స్థానిక మండల రైతులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణలోని రైతులకు సంబంధించిన భూ వివరాలు ధరణి పోర్టల్‌లో ఉంటాయి. ఇటీవల ప్రభుత్వం చేసిన మార్పులతో ఎమ్మార్వోలకు కూడా లాగిన్ సదుపాయం కలిగింది. ఈ అవకాశాన్ని అదనుగా తీసుకుని రెచ్చిపోతున్నాడీ ఎమ్మార్వో. ఏదైనా మార్పులు చేసి అప్లికేషన్ ను అప్రూవ్ చేయాలంటే అడిగినంత ముట్టజెప్పాల్సిందే. భూమి విస్తీర్ణాన్ని బట్టి ఈయన రేటు ఫిక్స్ చేస్తాడట. ఎకరానికి ఇంత అంటూ ప్రత్యేకించి కోట్ చేస్తాడని సమాచారం. ఇటీవల మర్పల్లి లోని ఉన్న 196 సర్వే నంబర్ విషయంలోనూ ఎమ్మార్వో అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ 196 సర్వే నంబరుపై మొత్తంగా 8.22 ఎకరాల భూమి ఉంది. అయితే, ఈ భూమి కబ్జాలో ఉందని, ఈ ఏడాది మే నెలలో అందిన ఫిర్యాదుతో ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలని ఎమ్మార్వో గణేష్ నాయక్ మండల గిరిద్వార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇంతవరకు కబ్జాదారుడికి పట్టా పాస్ బుక్ జారీ కాలేదు.
‘ధరణిలో ఎవరి పేరుంటే వారిదే భూమి’
మండలంలోని కొన్నిభూముల విషయంపై ఎమ్మార్వో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో ధరణి అఘాయిత్యాలకు ఎందరో పేద రైతులు బలయ్యారు. ధరణి పొరపాట్లలో భాగంగా 100 ఏళ్ళ నుండి కబ్జాలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నకానీ అప్పటి నిజాం కాలం నాటి ముస్లిం పేర్లు ధరణిలో కొందరి భూములకు పడ్డాయి. కానీ ఇలాంటి భూములపై ఖచ్చితమైన విచారణ చేసి కబ్జాలో ఉన్నవారికే న్యాయం చేస్తారు. కబ్జాలో ఉన్నవారికే పాసుబుక్ లు ఇప్పిస్తారు. ఇలాంటి భూములకు కూడా ధరణిలో పేరు మార్పుపై ఫీల్డ్ ఎంక్వైరీ చేసినప్పటికీ కానీ తాను ఎవరికీ అనుకుంటే వాళ్ళకి చేసేలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఆ ధరణి లో భూమి పేరు వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి మరీ అప్లికేషన్లు ఇప్పించుకొని మీకు భూమి వచ్చేలా చేస్తానని డబ్బులు తీసుకుంటున్నాడు. అదేంటని అడిగితే కబ్జాలో ఉన్నవారినే తిరిగి ఎమ్మార్వో బెదిరిస్తున్నాడట. వందేళ్లుగా కబ్జాలో ఉన్న విషయం తెలిసి కూడా ఎమ్మార్వో ఇలా నిర్లక్ష్య పూర్వకంగా వ్యవహరించడంపై స్థానిక రైతులు విమర్శిస్తున్నారు. స్థానిక ఎమ్మార్వో పై ఇన్ని విమర్శలు వచ్చిన గత ప్రభుత్వంలో వచ్చిన కలెక్టర్ నారాయణ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం నిజాయితీ అధికారిగా పేరు పొందిన కొత్త కలెక్టర్ ప్రతీక్ జైన్ అయినా ఈ అక్రమాలకు అలవాటు పడ్డ మర్పల్లి ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.