మెడికో ప్రీతి కేసులో రోజుకో వార్త బయటకొస్తుంది. సీనియర్ సైఫ్ వేధింపులు భరించలేకే ఆమె మత్తు ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుందని మొదట ప్రకటించారు. కట్ చేస్తే ప్రీతి శరీర భాగాలలో ఎక్కడ విష పదార్థాల ఆనవాళ్ళు లేవని టాక్సీకాలజీ రిపోర్ట్ లో తేలింది. మరి ప్రీతి చావుకు కారణం ఏమై ఉంటుంది..? అనే సందేహం అందరిలోనూ తలెత్తుతోంది. ఆమె అపస్మారక స్థితిలో పడి ఉండటానికి కారణం ఏమిటి..? ప్రీతి అపస్మారక స్థితిలో పడిఉన్న చోట కూల్ డ్రింక్స్, లెస్ ప్యాకెట్లు ఎలా వచ్చాయి..? ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లుగానే ఆమెను ఎవరైనా హత్య చేసి ఉంటారా..? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రీతి కేసులో నిందితుడిగా భావిస్తోన్న సైఫ్ నుంచి కీలక విషయాలు పోలీసులు రాబడుతున్నారని కథనాలు వస్తున్నాయి. కేవలం బ్రెయిన్ లేదని అన్నంత మాత్రాన ప్రీతి సూసైడ్ అటెంప్ట్ చేస్తుందని అనుకోలేదని విచారణలో సైఫ్ చెప్పినట్లు సమాచారం. అలాగే వాట్సాప్ చాట్ ను పరిశీలించిన పోలీసులు… సెక్యూరిటి సిబ్బంది, నర్సులను విచారించి కేసులో కీలక సమాచారం రాబడుతున్నారు. మరోవైపు.. ప్రీతి విషయంలో అసలేం జరిగింది..? ప్రీతి ఇంజక్షన్ తీసుకున్నప్పటి నుంచి నిమ్స్ కు తరలించే వరకూ ఏమేం జరిగింది..? అనే విషయాలపై లంబాడా ఐక్య వేదిక 11 ప్రశ్నలు లేవనెత్తుతోంది.
1. విధుల నిర్వహణలో ఉన్న ప్రీతి అపస్మారక స్థితిలో ఉండగా మొదట చూసిందెవరు..?
2. అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతి చేయి ఎందుకు కమిలిపోయింది..?
3. ప్రీతి అపస్మార స్థితిలో ఉన్న సమయం నుంచి ప్రీతి తండ్రికి ఫోన్ వచ్చే వరకు మధ్యలో ఏం జరిగింది..? ప్రీతి అపస్మారక స్థితిలో ఉండగానే కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు..?
4. ఫింగర్ ప్రింట్ లాక్‌లో ఉన్న ప్రీతి మొబైల్ డాటాను, అలాగే వారి బ్యాచ్‌మెట్‌లతో చేసిన చాట్‌ను డిలీట్ చేసిందెవరు..?
5. ప్రీతి మొబైల్‌లో హిస్టరీ చూడాల్సిన అవసరం ఏం వచ్చింది..? హిస్టరీలో డ్రగ్ గురించి సెర్చ్ చేశారని ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి దాని మీదనే కేసును తప్పుదోవ ఎందుకు పట్టించారు..?
6. ప్రీతి తండ్రి రాక ముందే అన్ని డిపార్ట్‌మెంట్‌ల హెడ్‌లు అక్కడికి ఎందుకొచ్చారు..?
7. వరంగల్‌కు ప్రీతికి చేసిన చికిత్స ఏమిటి..?
8. మంచి చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకొని వచ్చిన వారు నిమ్స్‌లో ఎలాంటి చికిత్స చేశారు..?
9. సైఫ్‌తోపాటు ఈ కేసులో భాగస్వాములు అయిన వారి పేర్లు ఎందుకు చేర్చలేదు..?
10. డిపార్ట్‌మెంట్ హెడ్.. ప్రీతిని ‘నాకు చెప్పకుండా ప్రిన్సిపాల్ దగ్గరికి పోతారా’ అని ఎందుకు బెదిరించారు..?
11. పోలీసు వ్యవస్థ ఈ కంప్లయింట్ రాగానే ఎందుకు నిర్లక్ష్యం వహించింది..? అన్న సందేహాలు లేవనెత్తింది.
వీటన్నింటిపై నిష్పాక్షపాతంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.
Also Read : ప్రీతి శరీరంలో విషపదార్థాల ఆనవాళ్ళు లేవు – ప్రీతిని హత్య చేశారా..?