తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా నియామకమైన మాణిక్ రావు థాకరే రంగంలోకి దిగబోతున్నారు. బుధ, గురువారాల్లో తెలంగాణ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, సీనియర్ నేతల అసంతృప్తిని మాణిక్ రావు థాకరే అడిగి తెలుసుకున్నారు.
కొత్త ఇంచార్జ్ వస్తోన్న నేపథ్యంలో సీనియర్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందోనని టి. కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఏ ఇంచార్జ్ నేత వచ్చిన వారితో సీనియర్లు సఖ్యతగా మెదిలింది లేదు. వారిపై ఆరోపణలు చేయడం అసమ్మతి నేతలు పనిగా పెట్టుకున్నారు. అప్పట్లో కుంతియా వచ్చినా తరువాత మాణికం ఠాగూర్ వచ్చినా అసంతృప్తి నేతల తీరు మారలేదు.
ఇదివరకు వచ్చిన ఇంచార్జ్ నేతలందరూ సీనియర్లతో సాఫ్ట్ గానే వ్యవహరించారు. కాని ఇప్పుడొస్తోన్న మాణిక్ రావు థాకరే మాత్రం కఠినంగా ఉంటారనే అభిప్రాయం వినిపిస్తోంది. మొదటగా ఆయన సాఫ్ట్ గా ఉంటారని ఆ తరువాత తనకు నచ్చకపోతే తన స్టైల్ లో హెచ్చరిస్తాయని చెబుతున్నారు. దీంతో ఈ కొత్త ఇంచార్జ్ తో సీనియర్లు ఎలా వ్యవహరిస్తాన్నది హాట్ టాపిక్ గా మారింది.
మాణిక్ రావుతో సీనియర్ల భేటీ సమయంలో వారి వాదన ఎలా ఉండనుంది..? మాణికం ఠాగూర్ ను ఇంచార్జ్ పోస్ట్ నుంచి తప్పించి సక్సెస్ అయ్యామనుకుంటున్న సీనియర్లు.. పీసీసీని కూడా మార్పించాలని బెట్టు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కుదిరితే.. రేవంత్ పాదయాత్రకు పర్మిషన్ ను క్యాన్సిల్ చేయించే విధంగా కొత్త ఇంచార్జ్ పై ఒత్తిడి పెంచాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ పీసీసీ, పాదయాత్రపై అధిష్టానం చాలా క్లియర్ గా ఉంది. పీసీసీని మార్చేదే లేదని డిగ్గీ రాజా ద్వారా తేల్చేసింది. పాదయాత్రకు అనుమతి ఇచ్చి క్యాన్సిల్ చేసే అవకాశం లేదు. పైగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో హత్ సే హత్ జోడో పేరిట పాదయాత్రలు చేపట్టాలని హైకమాండ్ ఆదేశించింది. దీంతో రేవంత్ పాదయాత్రపై సీనియర్లు ఒత్తిడి పెంచిన ప్రయోజనం ఉండదని నేతలకు మాణిక్ రావు థాకరే దిశానిర్దేశం చేయనున్నారు.
ఎన్నికల ఏడాది కావడంతో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని సీనియర్లకు సూచించనున్నారు మాణిక్ రావు థాకరే. పార్టీని గాడిలో పెట్టేందుకు మొదటగా సాఫ్ట్ గా డీల్ చేసి చూస్తారని అయినా కూడా మార్పు రాకపోతే మాణిక్ రావు మార్క్ చూపిస్తారని అంటున్నారు.
Also Read : ఐ కాంట్ బ్రీత్ : తెలంగాణలోనూ పునరావృతం