మంచు వారి ఫ్యామిలీలో విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయని ఆ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది కానీ ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏవి బయటకు రాకపోవడంతో ఈ ప్రచారమంతా కల్పితమేనని అనుకున్నారు. తాజాగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య విబేధాలు నిజమేనని తేల్చే వీడియో ఒకటి బయటకొచ్చింది.
మంచు మనోజ్ అనుచరుడు సారధి ఇంటికి వెళ్ళాడు మంచు విష్ణు. సారధిని ఏమన్నాడో ఏమో కాని అతనిపై దాడి చేసి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు విష్ణు. అక్కడున్న వారు విష్ణును నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. మంచు మనోజ్ పై కోపంతోనే అతని అనుచరుడిపై విష్ణు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన వీడియోను సారధి తన సోషల్ మీడియా స్టొరీలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సారధిపై దాడి చేసిన విషయం తెలుసుకున్న మనోజ్ స్పందించాడు. విష్ణు అప్పుడప్పుడు ఇలా వచ్చి నా అనుచరులపై దాడి చేస్తాడని అసహనం వ్యక్తం చేశాడు. ఇన్నాళ్లు సైలెంట్ గానున్న వీళ్ళు మంచు మనోజ్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అన్నదమ్ముల మధ్య విబేధాలు బయటపడ్డాయి. సోషల్ మీడియాలో, మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఇంకా ఈ వివాదంపై విష్ణు కానీ మోహన్ బాబు కానీ స్పందించలేదు.
పెళ్లి విషయంలోనే ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఐదేళ్ళ బాబు ఉన్న మౌనికను ఎలా పెళ్లి చేసుకుంటాడని విష్ణు అనడంతో మనోజ్ , విష్ణుల మధ్య విబేధాలు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలోనే మనోజ్ కు అత్యంత సన్నిహితుడైన సారధిపై కక్షగట్టుకొని అతనిపై విష్ణు దాడి చేసి ఉండొచ్చునని అభిప్రాయపడుతున్నారు.