అవును. అసెంబ్లీలోకి ఆలీ, బ్రహ్మానందం, రఘు బాబు, సునీల్, కోవై సరళ లాంటి 26 మంది తెలుగు కమెడియన్లు ఒక్కసారిగా జొరబడ్డారు. వాళ్లకు అసెంబ్లీలో ఎం పని? ఏదైనా షూటింగ్ జరిగిందా అని మీరు అడగొచ్చు. కానీ అలాంటిది ఏమీ లేదు. 26 మంది కమెడియన్లను రీమిక్స్ చేసినట్లు మంత్రి మల్లారెడ్డి ఒక్కడే పూనకంతో నటించాడు. కామెడీ ఎలా పండించాలో మల్లారెడ్డి దగ్గర వాళ్ళు కోచింగ్ తీసుకోవాలి.
అసెంబ్లీ దద్దరిల్లెలా నవ్వించాడు. కొందరు ఆ జోకులను అర్థం చేసుకుని నవ్వారు. మరి కొందరు ఆ జోకులు అర్థం చేసుకోలేక నవ్వారు. కెసిఆర్ ని తిడుతున్నాడో, పొగుడుతున్నాడో అర్థం కాలేక నవ్వారు. తనను తాను మెచ్చుకుంటున్నడో, కించ పరుచుకుంటున్నడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఈ టివిలో వచ్చే ‘జబర్దస్త్’ కార్యక్రమాన్ని లైవ్ లో చూపాడు. జబర్దస్త్ ఆర్టిస్టులను మించి కామెడి పండించాడు. ఆయన ప్రసంగం విన్న వారంతా ఆసక్తిగా వినడం దేవుడేరుగు.. నవ్వాపుకాలేకపోయారు పాపం.
ఇంటింటికి పాలుపోసే ఓ నిరుపేద మల్లా రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా మారడం మెచ్చుకోదగినదే. కానీ మంత్రిగా ఎదిగాక హుందాతనం పాటించాలి. సీరియస్ అంశాలను కామెడి గా చెపితే ఎలా? ఓ జోకర్లా మాట్లాడితే ఎలా? ఎక్కడ మొదలు పెట్టాడో – ఎక్కడ ముగించాలో తెలియక నోటికి వచ్చింది వాగితే ఎలా? అసలు అతను ఏం మాట్లాడుతున్నడో పక్కవాళ్ళకే కాదు – అతనికి కూడా అర్థం కాదు. కెసిఆర్ అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. అతనికి డబ్బా కొట్టడంలో తప్పు లేదు. కానీ కెసిఆర్ ని నెల్సన్ మండేలా, లింకన్ లాంటి నాయకులతో పోల్చాడు. వాళ్లు ఎవరో తెలుసా అంటే మా ఎదురింట్లో కిరాయికి ఉంటరు అంటడు . వాళ్ళకు నేను రోజు పాలు పోస్తున్న అంటడు. పర్వాలేదు. ఆ అమాయకత్వాన్ని క్షమించవచ్చు.
కానీ కెసిఆర్ ని దేవుడితో పోల్చడం ఏమిటి..? అతనికి దేవుడు కావచ్చు. కానీ ప్రజలకు దేవుడు ఎలా అయ్యాడు? ఇలాంటి అతి వినయం, అతి వాగుడు కొంపలు ముంచుతాయి. మల్లా రెడ్డి ఇలా సొల్లు వాగుడు వాగడం ఈ రోజు కొత్త కాదు. ఏ సభలో మాట్లాడినా ఇదే అతి వినయం చూపుతాడు. అతి వినయం దూర్త లక్షణం.అలాంటి వాడికి అసెంబ్లీలో మైక్ ఇవ్వడం స్పీకర్ పోచారం తప్పు అని జనం తిడుతున్నారు.