సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పునాది లాంటిదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఖమ్మం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపించిన నాయకుడు భట్టివిక్రమార్క అని కొనియాడారు.
కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు టి.ఆర్.ఎస్.లో చేరి కాంగ్రెస్ కు, గెలిపించిన ప్రజలకు ద్రోహం చేశారని, వీరిని ఖమ్మం జిల్లా రాజకీయాల నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దళితున్ని సిఎం చేస్తా అని చెప్పి మాట తప్పిన సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని పేర్కొన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ దళితున్ని రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా చేస్తే జీర్ణించుకోలేని సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్లో చేర్చుకుని దళితుడికి ప్రతిపక్ష పదవి పోయేలా చేశాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి పువ్వాడ అజయ్ ను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తయారు చేసిందని, నాయకునిగా తయారు చేసిన కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి టిఆర్ఎస్ లోకి వెళ్లి మంత్రి పదవి లోకి వచ్చిన పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లాలో చేస్తున్న అరాచకాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మంలో యువకుడు చేసుకున్న ఆత్మహత్య ఘటనపై సంపూర్ణమైన దర్యాప్తు చేస్తామన్నారు. అజయ్ చేస్తున్న అరాచకాల కు తప్పనిసరిగా లెక్క పెట్టుకోవాలని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జైల్లో పెట్టడం ఖాయమని వెల్లడించారు