హైదరాబాద్ లో భారత్ జోడో యాత్ర విజయవంతగా ముగిసింది. నగరంలో రాహుల్ యాత్రను సక్సెస్ చేయడంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ కో-ఆర్డినేటర్ రోహిన్ రెడ్డి కీలక భూమిక పోషించారు. అక్టోబర్ 23న భారత్ జోడో యాత్ర పేరుతో తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన రోహిన్ రెడ్డి..జోడో యాత్రకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రచార రథాలు, ఎల్ఈడీ హవానాలు ఏర్పాటు చేశారు.
ఈ యాత్రలో రాహుల్ గాంధీ ప్రయాణాన్ని తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక, గ్రేటర్ లో యాత్రను సక్సెస్ చేయడంపై వారం రోజులుగా తలమునకలైన రోహిన్ రెడ్డి, నగరమంతా హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు, ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి యాత్రను చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయేలా చేశారు.
హైదరాబాద్ లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర మంగళవారం మధ్యాహ్నం చార్మినార్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు కొనసాగింది. ఈ యాత్ర నెక్లెస్ రోడ్డు చేరుకునే వరకు రోడ్లన్నీ జనంతో కిక్కిసిరిపోయాయి. అడుగడుగునా స్వాగత తోరణాలతోపాటు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బోనాలు, బతుకమ్మలతో మహిళలు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు.
ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద జరిగిన సభ ప్రాంగణం చుట్టూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ , మాణికం ఠాగూర్ తోపాటు పలువురు నేతల కటౌట్లతో కాంగ్రెస్ కళ ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసిన రోహిన్ రెడ్డి ముఖ్య నేతలందరి చేత ప్రశంసలు పొందారు. యాత్ర ఆసాంతం రాహుల్ కు గ్రేటర్ హైదరాబాద్ లో అపూర్వ స్వాగతం లభించడంతో ఏఐసీసీ అగ్రనేతలు సైతం ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
నగరంలో ఏర్పాట్లపై పార్టీ జాతీయ అద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకుని రోహిన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఏఐసీసీ అద్యక్షుడిగా ఎన్నికై మొదటిసారి హైదరాబాద్ కు వచ్చిన ఖర్గే కు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్ళిన రోహిన్ రెడ్డికి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ లో భారత్ జోడో యాత్ర ఏర్పాట్లు ఊహకు అందని విదంగా చేశావని ప్రశంసించి..శాలువతో రోహిన్ ను సన్మానించారు ఖర్గే. ఇదే ఊపుతో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు.