తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల తాకిడి చూస్తుంటే కర్ణాటక పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అక్కడ కాంగ్రెస్ లో చేరేందుకు బీజేపీ నేతలు క్యూ కట్టారు. మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, టికెట్ రాని అసంతృప్త నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపించడం జనాల్లో కాంగ్రెస్ కు మైలేజ్ పెంచేసింది. ఇప్పుడు ఎన్నికల ముంగిట తెలంగాణ కాంగ్రెస్ లోకి అదే తరహలో చేరికలు కొనసాగుతుండటంతో పార్టీలోనే కాకుండా ప్రజల్లో కూడా అధికారంలోకి వచ్చే పార్టీ కాంగ్రెస్ అనే అభిప్రాయం ఏర్పడేలా చేస్తోంది.
ఈ తరహ అభిప్రాయం జనాల మైండ్ సెట్ ను పూర్తిగా మార్చేస్తుంది. ఓ పార్టీ వైపు మొగ్గే ఓటర్లను సైతం డైవర్ట్ చేస్తోంది. ఇదే బీఆర్ఎస్ ఆందోళన కూడా. అందుకే కాంగ్రెస్ లోకి చేరికలను నిలువరించేందుకు ఆపసోపాలు పడుతోంది. గతంలో జూపల్లి, పొంగులేటిలను పోతేపోని అని లైట్ తీసుకున్న బీఆర్ఎస్ .. ఇప్పుడు పోతామని అనుమానిస్తోన్న నేతలను పిలిచి మరీ మాట్లాడుతోంది. పార్టీలో గుర్తింపు ఇస్తామని పదవుల ఆశ చూపుతోంది. కాంగ్రెస్ కు ఏమాత్రం స్పెస్ ఇవ్వొద్దని ప్రాధాన్యత లేని లీడర్లను సైతం పార్టీలో కొనసాగేలా చూడాలంటూ నేతలకు బాధ్యతలు అప్పగిస్తోంది.
మైనంపల్లి హన్మంత రావు, కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు కాంగ్రెస్ చేరేందుకు అంగీకరించగా..బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ లు కాంగ్రెస్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరికొద్ది రోజులు గడిస్తే ఇంకొంతమంది లీడర్లు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపోచ్చు. మొత్తంగా కాంగ్రెస్ లో ఓ రకమైన పాజిటివ్ అట్మాస్పియర్ స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రానున్న రోజుల్లో ఇంకొద్ది మంది నమ్మితే మాత్రం బీఆర్ఎస్ లో ఊహించని నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు.
Also Read : కల్వకుర్తిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కసిరెడ్డి..!!