ఖమ్మంలో నిర్వహిస్తోన్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జేడీఎస్ నేత కుమారస్వామి కనిపించలేదు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతోనే కుమారస్వామి పాల్గొనలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా..ఇంతటి కీలకమైన సభకు కనీసం పార్టీ ప్రతినిధి అయిన పంపించాల్సింది. కాని జేడీఎస్ తరుఫున ఎవరూ ఈ సభకు హాజరు కాలేదు. దీంతో బీఆర్ఎస్ కి ఆదిలోనే మిత్రులు దూరమైతున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి.. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ను మర్చుతున్నామని కేసీఆర్ ప్రకటించిన తరువాత జరిగిన ప్రతి కార్యక్రమాల్లో కుమారస్వామి పాల్గొన్నారు. తీర్మానం చేసినప్పుడు.. అధికారికంగా ఈసీ నుంచి వచ్చి సంతకం చేసినప్పుడు..ఢిల్లీ కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలోనూ హాజరయ్యారు. కాని పార్టీ ఆవిర్భావ సభకు కుమారస్వామి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కుమారస్వామితోపాటు ప్రకాష్ రాజ్ కూడా ఈ సభలో కనిపించలేదు. గతంలో ఆయన బీఆర్ఎస్ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఫామ్ హౌజ్ లో కేసీఆర్ ను కలిసి చర్చించారు. కర్ణాటక బీఆర్ఎస్ బాధ్యతలు ప్రకాష్ రాజ్ కు ఇస్తారని ప్రచారం జరిగింగి. కాని ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలోనే నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభకు వీరిద్దరూ అటెండ్ కాకపోవడం ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసే అంశంలో జేడీఎస్, బీఆర్ఎస్ ల మధ్య సఖ్యత కుదరలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. పొత్తు పెట్టుకున్నా బీఆర్ఎస్ పోటీ చేయదని జేడీఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా రెండు పార్టీల మధ్య ఐక్యత లేకపోవడంతో కుమారస్వామి బీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.