తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం ఖాయమైంది. బీఆర్ఎస్ కు రేపోమాపో అన్ని అనుమతులు రానున్నాయి. దీంతో తెలంగాణలో తదుపరి సీఎం ఎవరన్న చర్చ జరుగుతుండగా కూకట్ పల్లిలో టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి.
కూకట్ పల్లిలో మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. గతంలో కేటీఆర్ సీఎం అని మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగ వేదికలపైనే వ్యాఖ్యానించారు. అప్పుడు కేటీఆర్ సీఎం అనేప్రచారం జరిగినా ముగింపు పడింది. తాజాగా మరోసారి కేటీఆర్ సీఎం అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.
సంక్రాంతికి నూతన సచివాలయం ప్రారంభం కానుంది. ఆ తరువాత మార్చిలో బడ్జెట్ సమావేశాల అనంతరం అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో టీఆర్ఎస్ కు హ్యాట్రిక్ విజయాన్ని అందించి కేటీఆర్ కు పట్టాభిషేకం చేయాలని కేసీఆర్ కుతూహలంతో ఉన్నారు. కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగిస్తేనే జాతీయ రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టె సమయం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టు ఉన్నారు.
ఈ అంచనాలను ముందే పసిగట్టిన టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కూకట్ పల్లి పర్యటన సందర్భంగా కాబోయే సీఎం అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Also Read : కొత్త సచివాలయం… కొత్త సీఎం – ఐడియా అదిరిందయ్యా చంద్రం..!