బీఆర్ఎస్ టికెట్ దక్కని వారిని మంత్రి కేటీఆర్ పలు హామీలను ఇస్తూ సైలెంట్ చేస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా చేయండి…మీ రాజకీయ భవిష్యత్ బాధ్యత తనది అంటూ అసంతృప్తులను లైన్ లో పెడుతున్నారు. ముఖ్యంగాస్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిల అసంతృప్తి పార్టీని పలుచన చేసేలా కనిపించింది. దాదాపు సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇచ్చి తమకు మొండిచేయి చూపుతారా..? అని ఇద్దరు నిరసన కూడా తెలిపారు. దీంతో వారిని కూల్ చేసే బాధ్యతను తీసుకున్నారు కేటీఆర్. ఇందుకోసం వారిని ప్రగతి భవన్ కు పిలిపించిన కేటీఆర్.. వారిని కూర్చోబెట్టి మాట్లాడారు.
కేటీఆర్ తో జరిగిన భేటీలో తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కడియం గెలుపు కోసం తాను పని చేస్తానని రాజయ్య వ్యాఖ్యానించడం గమనార్హం. మొన్నటి వరకు కడియం ఎలా గెలుస్తాడో చూస్తానని శపథం చేసిన రాజయ్య కేటీఆర్ తో భేటీ తరువాత మెత్తబడటంతో ఆయనకు ఏం హామీ ఇచ్చి బుజ్జగించారు..? అనేది చర్చనీయాంశం అవుతోంది. అలాగే..జనగామ టికెట్ ను పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫైనల్ చేశారు. పల్లా గెలుపు కోసం ముత్తిరెడ్డి పని చేయాలని కేటీఆర్ సూచించారు. కేసీఆర్ తో భేటీ అయిన తరువాత ముత్తిరెడ్డి కూడా రాజయ్య తరహలోనే మెత్తబడ్డారు. ఈ ఇద్దరి నేతలకు కేసీఆర్ , కేటీఆర్ లు ఏం హామీ ఇచ్చి సైలెంట్ చేశారనేది హాట్ టాపిక్ గా మారింది.
ఎలాగూ జనగామ నుంచి పల్లా పోటీ చేయడం ఖాయమైంది. దాంతో ఆయన చైర్మన్ గానున్న రైతు బంధు సమితి పదవిని రాజయ్యకు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే సమయంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నారు. దాంతో ఆ పదవిని ముత్తిరెడ్డికి అప్పగిస్తామని హామీ ఇచ్చి.. ఈ ఇద్దరు అసంతృప్తులను కేటీఆర్ లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. రైతు బంధు సమితికి ప్రోటోకాల్ క్యాబినెట్ హోదాలో ఉంటుంది కాని పెద్దగా ప్రాధాన్యత ఏమి ఉండదు. ఆర్టీసీ చైర్మన్ పదవి అనేది ఓ నామినేటెడ్ పదవి. ఎమ్మెల్యేలుగా ఉన్న వీరికి ఈ పదవులను ఆఫర్ చేయగానే సైలెంట్ అయ్యారా..?అనేది మరో చర్చ జరుగుతోంది.
Also Read : బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ఎమ్మెల్యేలు నమ్ముతున్నారా..?