ఫార్ములా ఈ – కార్ స్కామ్ లో ఏసీబీ దూకుడు..ఆర్ఎస్ఎస్ నేతల ఇంటి చుట్టూ కేటీఆర్ ప్రదక్షిణలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ అవినీతి ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా ఈ – కార్ రేసింగ్ స్కాం విషయంలో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమయినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఆయన అరెస్టుపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కేటీఆర్ కూడా ఫార్ములా ఈ -కార్ రేసింగ్ పై క్లారిటీ ఇస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. కానీ ఏసీబీ మాత్రం వేగంగా పనిచేస్తూ వెళ్తోంది. ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరింది. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఒక ఎమ్మెల్యేను విచారించేందుకు నిబంధనల మేరకు గవర్నర్ పర్మిషన్ తప్పనిసరి. అయితే బంతి గవర్నర్ కోర్టులో ఉండటంతో కేటీఆర్ హస్తినకు పరుగులు పెట్టారు. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ పెద్దలను కలిసి వారి ద్వారా గవర్నర్ పై ఒత్తిడి కోసం ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి.
నిజానికి బీఆర్ఎస్-బీజేపీ చీకటి బంధం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా ఒకరి అవసరాల కోసం మరొకరు తరచూ సాయం చేసుకుంటూనే ఉన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాటూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజా ప్రయోజనాల కోసం కూడా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మూడు నల్ల చట్టాల కోసం దేశమంతా గళమెత్తితే…కారు పార్టీ మాత్రం వాటికి పార్లమెంటులో వత్తాసు పలికింది. ఇదొక్కటే కాదు అనేక సందర్భాల్లో ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్రానికి కావాల్సినంత మద్దతు ఇస్తూనే వచ్చింది. ఇక రాజకీయంగా బీజేపీ-బీఆర్ఎస్ తెలంగాణలోనూ అంటకాగిన సందర్భాలు అనేకం. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వాన్ని రక్షిస్తూ వచ్చింది కేంద్రంలోని బీజేపీ సర్కారు. ఇందుకు ప్రతిఫలంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మేలు చేకూరేలా నాటి బీఆర్ఎస్ వ్యవహరించిందన్నది జగమెరిగిన సత్యం. అంతెందుకు గతంలో డిపాజిట్లు కూడా రాని చోట్ల ఓటు డైవర్షన్ పాలిటిక్స్ తో కమలం పార్టీకి కావాల్సినంత మేలు జరిగిందన్నది అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా నామమాత్రపు అభ్యర్ధులతో కాషాయపార్టీ కోసం కారు త్యాగం చేసి షెడ్డుకు వెళ్లింది. దాంతో అప్పటి వరకు రహస్యంగా ఉన్న రెండు పార్టీల బంధంపై గులాబీ కార్యకర్తలకు కూడా క్లారిటీ వచ్చేసింది.
తవ్వే కొద్దీ బయటపడుతున్న గత ప్రభుత్వ అక్రమాలతో కారు-కాషాయం మళ్లీ ఒక్కటయ్యాయి. జీఎస్టీ స్కామ్, గొర్రెల పథకంలో అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, కాళేశ్వరంలో కమీషన్ల కమామిషు, అమోయ్ కుమార్ భూముల బదలాయింపు, తాజాగా ఫార్ములా ఈ-కార్ రేస్. ఇలా గతంలో తాము చేసిన తప్పులన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టడంతో..కారు పార్టీ యువరాజు ఆర్ఎస్ఎస్ నేతల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. హైదరాబాద్ లోనే ఉన్నా దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేయండి అని సవాల్ చేసి గంటలు కూడా గడవకముందే…శరణు కోసం కాలికి బలపం కట్టుకొని ఢిల్లీలో తిరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానై…అన్ని శాఖల్లో వేలు పెట్టిన కేటీఆర్…ఇప్పుడు తప్పులు ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుంటుంటే తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.